వచ్చే నెలలో ప్రారంభంలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థులు జోబిడెన్, కమలా హారిస్‌లకే అత్యధిక మంది ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. ప్రధాని మోదీతో తనకు గల స్నేహాన్ని చూపి ప్రవాస భారతీయుల మద్దతు కూడదీసుకోవడానికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రవాస భారతీయులు రిపబ్లికన్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆధారాలు లేవని ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే 2020 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సహకారంతో పెన్సిల్వేనియా యూనివర్శిటీ, జాన్‌హాప్కిన్స్ యూనివర్శిటీల పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు.
అలాగే ప్రవాస భారతీయులు అమెరికా- భారత్‌ల మధ్య సంబంధాలపై అంత ప్రాధాన్యత కనబరచరని, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని నివేదికలో పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రవాస భారతీయులు అత్యధికంగా డెమొక్రాట్ అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు.
2018లో అమెరికాలో సుమారు 4.16 మిలియన్ల భారతీయ సంతతికి చెందిన వారు ఉండగా, వారిలో 2.62 మిలియన్లు అమెరికా పౌరులు. వారిలో 1.9 మిలియన్ల పౌరులు వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతను కలిగి ఉన్నారు. అంటే 0.82 శాతం ఓటింగ్‌కు అర్హులుగా ఉన్నారు.
ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసే ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగిందంటూ గతంలో వెల్లడించిన సర్వేలను ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే తోసిపుచ్చింది. సర్వే ప్రకారం.. 72 శాతం మంది జోబిడెన్‌కు ఓటు వేస్తామని వెల్లడించగా, 22 శాతం మంది ట్రంప్‌కు ఓటు వేయనున్నట్లు ప్రకటించారు.
డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 77 శాతం మంది ఓట్లు వేయగా.. ట్రంప్‌కు కేవలం 16 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారని 2016లో నేషనల్ ఏసియన్ అమెరికన్ సర్వే నివేదికను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉపాధ్యక్షురాలి పదవికి భారతీయ మూలాలున్న సెనేటర్ కమలాహారిస్‌ను ప్రకటించడం కూడా ఎన్నికల్లో కొంత ప్రభావాన్ని చూపుతుందని జోబిడెన్ భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రవాస భారతీయులను కొంత ఉత్సాహపరిచిందని ఈ సర్వే తెలుపుతున్నది. అధిక శాతం మంది ఇప్పటికే డెమోక్రటిక్ అభ్యర్థివైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేసింది.
49 శాతం మంది హారిస్‌ను ప్రకటించడం ఉత్సాహం కలిగించిందని ప్రకటించగా, 15 శాతం మంది వ్యతిరేకంగా పేర్కొన్నారని తెలిపింది. రిపబ్లికన్ల కంటే అమెరికా -భారత్‌ల మధ్య సంబంధాలను డెమోక్రాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తారని అధిక శాతం మంది ఆశిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
హసీనా మేనకోడలు బ్రిటన్ మంత్రిగా రాజీనామా