మతిస్థిమితంలేని పార్టీగా కాంగ్రెస్‌   

ఆరేళ్ల తర్వాత పార్టీ నుంచి ఒకరు ఎందుకు వెళ్లిపోతున్నారో కూడా యోచించే శక్తి లేని, మతిస్థిమితంలేని పార్టీగా కాంగ్రెస్‌ తయారైందని బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ సినీ నటి ఖుష్బూ విమర్శించారు. చాలా సంతోషంతో చెన్నై తిరిగి వచ్చానని, బీజేపీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో  పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. 

బీజేపీలో చేరడానికి రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ ప్రధాన కారణమని తెలిపారు. ఓ నాయకుడు (మురుగన్‌) పార్టీని బలపరిచేందుకు తమ పార్టీలోకి రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తుండగా, మరో పార్టీ నాయకుడు (టీఎన్‌సీసీ నేత అళగరి) ఆరేళ్లుగా తాను పార్టీలో ఉన్నా ఓ నటిగానే చూశానని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌లో ఉన్న వారికీ, ఆ పార్టీ నుంచి వెళ్లిపోయేవారికి ఎలాంటి మర్యాద లేదని ఖుష్బూ ఆరోపించారు. పార్టీ నుంచి ఓ నాయకుడు, నాయకురాలో ఎందుకు వైదొలగుతున్నారో యోచించే శక్తిలేని పార్టీగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఉంటోందని ఆమె ఎద్దేవా చేశారు.

ఆరేళ్లు గడిచిన తర్వాతే ఆ పార్టీ నాయకుడికి తాను నటిగా ఉన్నాననే విషయం గుర్తుకు రావడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. టీఎన్‌సీసీ నేత తాను బీజేపీలో చేరడంపై వ్యాఖ్యానిస్తూ మేథోలోపం వల్లే తాను ఆ పార్టీలో చేరానని విమర్శించారని, ప్రస్తుతం తనకు మేథస్సు బాగా పనిచేస్తోందని ఆయన గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఖుష్బూ ఎద్దేవా చేశారు.

పార్టీ అభివృద్ధి కోసం తన శక్తినంతా ధార పోసి, ఆ పార్టీ నుంచి వైదొలగినప్పుడు ఆ విషయంపై యోచించడానికి కూడా వీలులేని మెదడుతో ఉన్న పార్టీలా కాంగ్రెస్‌ ఉందని ఆమె విమర్శించారు. మొదట తాను డీఎంకే నుంచి వైదొలగినప్పుడు ఆ పార్టీపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయలేదని, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి వైదొలగినా ఎలాంటి ఆరోపణలు చేయలేదని చెప్పారు.

అయితే తనపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోనని ఖుష్బూ హెచ్చరించారు. తానింకా ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ ఆశయాలను పాటించే వ్యక్తినేనని, మహిళాభ్యుదయం కోసం పాటుపడిన నేతగా ఆయనను ఆరాధిస్తానని ఖుష్బూ తెలిపారు. పెరియార్‌ ఆశయాల ప్రకారం ఎవరూ రాజకీయాలు మాట్లాడకూడదని ఆమె చెప్పారు.

తాను పదవి కోసం బీజేపీలో చేరలేదని, తనకన్నా సీనియర్లు పార్టీలో ఉన్నారని చెప్పారు. తన భర్త దర్శకుడు సుందర్‌ ఒత్తిడి చేయడం వల్లే బీజేపీలో చేరానని చెప్పడం భావ్యం కాదని ఆమె మండిపడ్డారు. ఆరేళ్లుగా కాంగ్రెస్‌లో ఎన్నో అవమానాలకు గురై విసిగి వేసారిన మీదటే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేసారు.

దేశానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని ఆమె శపథం చేశారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు మేలు చేయాలన్నదే తన ప్రధాన ఆశయమని ఆమె చెప్పారు.