బెంగళూరు హింసలో ఎస్‌డీపీఐతో కాంగ్రెస్ కుమ్మక్కు

బెంగళూరు నగరంలో ఆగస్టులో జరిగిన విధ్వంసం వెనుక భారీ కుట్ర ఉందని, కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు కేవలం ఓ సాకు మాత్రమేనని దర్యాప్తులో వెల్లడైంది. ఓ కాంగ్రెస్ నేత తన రాజకీయ లక్ష్యాన్ని సాధించడం కోసం ఓ ముస్లిం సంస్థతో చేతులు కలిపారని బయటపడింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై ఆగస్టు 11న దాడి  జరిగిన సంగతి తెలిసిందే. ఈ విధ్వంసకాండలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 50 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ కేసుపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ప్రాథమిక ఛార్జ్‌షీటును సోమవారం స్థానిక కోర్టుకు సమర్పించింది. 

మాజీ మేయర్, కాంగ్రెస్ నేత ఆర్ సంపత్ రాజ్, పులకేసి నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అబ్దుల్ రకీబ్ జకీర్‌లను నిందితులుగా పేర్కొంది. ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్‌ను ఓ సాకుగా మాత్రమే వీరు వినియోగించుకున్నారని తెలిపింది. 

ఈ విధ్వంసం సృష్టించేందుకు ఎస్‌డీపీఐ సహకారం తీసుకున్నారని పేర్కొంది. మాజీ మేయర్ సంపత్ రాజ్ తన రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు అఖండ శ్రీనివాస మూర్తిపై దాడి చేయాలని మూడు నెలల ముందుగానే కుట్ర పన్నినట్లు ఈ ఛార్జిషీట్‌ పేర్కొంది.

ఈ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా పోలీసులపై ఆగ్రహం పెంచుకున్న స్థానిక ముస్లింలతో కలిసి దాడి చేసినట్లు పేర్కొంది.

డీజే హళ్ళిలో మే నెలలో సంపత్, జకీర్ కుట్ర పన్నారని, అదను కోసం వేచి చూశారని పేర్కొంది. ప్రజాగ్రహాన్ని శ్రీనివాస మూర్తిపై మళ్ళించేందుకు కాచుకుని కూర్చున్నారని తెలిపింది. 

శ్రీనివాస మూర్తి బంధువు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టును సాకుగా చూపిస్తూ దాడి చేశారని తెలిపింది. మూర్తిని రాజకీయంగా అంతం చేయాలని జకీర్ కోరుకున్నప్పటికీ, ఆయనను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే మూక దాడి జరిగిందని తెలిపింది. 

అల్లరి మూకను దూరం నుంచి సంపత్ రాజ్, జకీర్ సమన్వయపరిచారని తెలిపింది. అల్లర్లు జరిగే ప్రాంతంలో తాము ఉన్నట్లు నిరూపించేందుకు వీలు లేకుండా తమ ఫోన్లను తమ ఇళ్ళ వద్ద వదిలేశారని పేర్కొంది. 

కాగా,  తన సొంత పార్టీ నాయకుల పేర్లు ఛార్జిషీటులో ఉండటం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని శ్రీనివాస మూర్తి దీనిపై స్పందిస్తూ పేర్కొన్నారు.