పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. మరో నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.
వాయుగుండం వేగం నెమ్మదించడం కొనసాగితే ప్రమాదమేనంటూ ఆంధ్రా యూనివర్సిటీ ఓషినోగ్రఫీ అధికారులు విశ్లేషించారు. దీని ప్రభావంతో కోస్తా అంతట పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని, తీర, కొండవాలు ప్రాంతాల జనజీవనం అతలాకుతలం అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా తీరం దాటిన తర్వాత 4 నుండి 5 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. వాయుగుండం నెమ్మదించడం కొనసాగితే తుపానుగా కూడా మారే అవకాశాలున్నాయని, రాగల 48 గంటలూ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్‌ను శుభ్ర పరచాలని సూచించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మరోవంక, ఎగువ నుండి చేరుతోన్న వరద కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ప్రకాశం బ్యారేజీకి సోమవారం రాత్రి లక్ష క్యూసెక్కుల వరద చేరినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 98,801 అవుట్ ఫ్లో 93,800 క్యూసెక్కులుగా నమోదయింది. వరద ప్రభావిత మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఎఎండి.ఇంతియాజ్ అప్రమత్తం చేశారు.
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు, తుంగభద్ర డ్యామ్ నుంచి, హంద్రీనది నుంచి వరద ఉధృతి పెరగడంతో సోమవారం రాత్రి 9.30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,01,944 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది.
More Stories
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్