జడ్జిలపై అనుచిత పోస్టుల కేసు సీబీఐకి అప్పగింత 

హైకోర్టు తీర్పులు, న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టింగులపై నమోదయిన కేసులను సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు గత రిజిస్ట్రార్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో 20 పేజిల్లో తీర్పు సోమవారం వెలువరించింది. 

ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని సీబీఐని ఆదేశించింది. ఒకవేళ కుట్ర ఉంటే స్థాయి, హోదాతో సంబంధం లేకుండా దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.   

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యల వివరాలను సీబీఐ అడిగినప్పుడు అందించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది.  

సిఐడి దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ కేసులను సిబిఐ కి అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని సిఐడి తోపాటు రాష్ట్ర ప్రభుత్వం గత విచారణలోనే హైకోర్టుకు చెప్పాయి. 

ఈ నేపథ్యంలో కేసును సిబిఐ కి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవి తో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు చెప్పింది. 

‘‘భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించే బాధ్యతా భారాన్ని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ మోస్తున్నారు. అయితే కొందరు తప్పుడు వ్యక్తుల పరోక్ష, ప్రత్యక్ష దాడి కారణంగా ఆయన ఆవేదనతో కోర్టును ఆశ్రయించారు. ఉన్నత స్థాయి, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండి కూడా కొందరు ఆ తప్పు చేయకుండా స్వీయ నియంత్రణ పాటించలేదు’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

 ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీ సైబర్‌ క్రైం నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ డైరెక్టర్‌కు అప్పగించాలని ఆదేశించింది. 

ఆ ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించి తక్షణం చర్యలు చేపట్టాలని సీబీఐకి సూచించింది.  అవసరమైతే మరిన్ని ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోపు దర్యాప్తు చేసి నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని తెలిపింది. విచారణను డిసెంబరు 14 కు వాయిదా వేసింది.