పండుగ వేళల్లో ప్రజలు గుమికూడొద్దు

పండుగ వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దేశ ప్రజలను కోరారు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రజలు ప్రభుత్వం పెట్టిన నిబందనలను విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
 
దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకునేందుకు ప్రార్థనా స్థలాల్లో ప్రజలు గుమికూడనవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన చెప్పారు. పెద్ద సంఖ్యలో గూమికూడడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఆయన హెచ్చరించారు. కరోనా నియంత్రణే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రజలు కరోనా నిబంధనలను విధిగా పాటించాలని ఆయన సూచించారు. ప్రార్థనలు చేసేందుకు ఆలయాలకు , చర్చిలకు, మసీదులకే వెళ్లాల్సిన అవసరం లేదని, దేవుడిపై నమ్మకంతో ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని మంత్రి చెప్పారు.
 
కరోనాతో భారత్ పోరాటం చేస్తుందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించినప్పుడే వైరస్ కట్టడి సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలని మంత్రి ప్రజలకు సూచించారు.