ప్రజలకు ప్రాపర్టీ కార్డులను అందించే స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వమిత్వ) పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు.
ప్రాపర్టీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తమ ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.
జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్‌ల జయంతి కార్యక్రమాలు ఆదివారం జరుగుతున్నాయని, వీరిద్దరూ గ్రామీణాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారని తెలిపారు. మ్యాపింగ్ చేయడానికి డ్రోన్ల వంటి టెక్నాలజీలను వాడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
దశాబ్దాలుగా గ్రామాల్లో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రెండు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందచేసిందని చెప్పుకొచ్చారు.
స్వమిత్వ పథకాన్ని మోదీ 2020 ఏప్రిల్ 24న ప్రారంభించారు. ఈ పథకం లబ్ధిదారులకు కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాలకు చెందిన లబ్ధిదారులు వీటిని పొందుతారు. ఈ పథకాన్ని 2024 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.
ఎవరైనా తన ఇంటికి యజమాని అయ్యారంటే, వారి ఆత్మగౌరవం బలపడుతుందని ప్రధాని చెప్పారు. తాను భద్రంగా, బలంగా ఉన్నట్లు భావిస్తారని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్ళపై ఇతరుల (అక్రమార్కుల) దృష్టి పడకుండా ఈ పథకం క్రింద జారీ చేసే కార్డు దోహదపడుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా స్వయం సమృద్ధి కోసం దేశం నిర్వహించే కార్యక్రమంలో గ్రామీణ భారతం తన వంతు పాత్ర పోషించేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ప్రధాని తెలిపారు. గ్రామీణులకు తమ ఆస్తి, భూమికి సంబంధించిన సక్రమమైన పత్రాలు ఉంటే, వారికి రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు తిరస్కరించజాలవని స్పష్టం చేశారు.
ప్రపంచ జనాభాలో కేవలం మూడో వంతు మంది ఆస్తులకు మాత్రమే పత్రాలు ఉన్నట్లు తెలిపారు. గ్రామీణులు ఇతరులపై ఆధారపడటానికి తాను అంగీకరించబోనని చెప్పారు. వారిని స్వయం సమృద్ధం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.
కాగా స్వమిత్వ పథకం ద్వారా లక్ష మంది ఆస్తిదారులు తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్ లింక్ ద్వారా తమ ప్రాపర్టీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందచేస్తాయని పేర్కొంది.
స్వామిత్వలో గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తిస్తారు. దీంతో వారు బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడంతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవకాశం లభించనుంది. ఈ పథకం ద్వారా ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాలకు చెందిన ప్రజలు లబ్ది పొందుతున్నట్లు కేంద్ర పేర్కొంది.
ప్రజల ఆస్తుల వివరాలతోపాటు రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్, పంచాయతీ కార్యాలయం లాంటి వివరాలన్నీ స్వామిత్వ సర్వేలో చేర్చనున్నారు.
More Stories
వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి