రేపిస్ట్ కు కాంగ్రెస్ సీట్… మహిళా నేత ఆగ్రహం!

త్వరలో ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికకు  కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిపై అదే పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు  మండిపడ్డారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు ఎమ్మెల్యేగా నిలబడడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో ఎమ్మెల్యే అభ్యర్ధి మహిళా నాయకురాలిపై పార్టీ ఆఫీస్ లోనే  దాడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఈ కలకలం రేగింది.

ఉత్తర ప్రదేశ్ లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధి ముకుంద్ భాస్కర్ మణి త్రిపాఠిని నిలబెడుతూ సీటును ఖరారు చేసింది. ఇదే విషయంపై పార్టీ ఆఫీస్ లో మహిళా నాయకురాలు తారా యాదవ్ భాస్కర్ అభ్యర్ధిత్వాన్ని ప్రశ్నించింది.

రేపిస్టైన భాస్కర్ ను ఎమ్మెల్యేగా ఎలా నిలబెడతారు..? ఇది పార్టీ ఇమేజ్ ను పాడు చేస్తుందంటూ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ నాయక్ ముందు ఆమె నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్, అతని అనుచరులు తారా యాదవ్ పై దాడి చేశారు.

ఈ దాడిలో ఆమె మొహంపై గాయాలయ్యాయి.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా ప్రియాంక గాంధీని డిమాండ్ చేశారు. రేపిస్ట్ కు టికెట్ ఇవ్వడం తనకు నచ్చలేదని ఆమె స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ను కించపరచాలనే నాయకులు రేపిస్టైన అభ్యర్ధిని ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.   “నేను నాలుగేళ్లుగా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్నాను,ఇంకా కొనసాగుతాను. అత్యాచారం చేసిన నిందితుడు టికెట్ అందుకోవడాన్ని నేను చూడలేను, ”అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తనను కొట్టిన పార్టీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు తారా యాదవ్ తెలిపారు.

ఇదిలావుండగా, జాతీయ మహిళా కమీషన్  (ఎన్‌సిడబ్ల్యు) చైర్‌పర్సన్ రేఖ శర్మ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.” ఇలాంటి సిక్ మైండ్ పీపుల్  రాజకీయాల్లోకి ఎలా వస్తారు …?” అంటూ ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించారు.