ఏపీ హైకోర్టు లో జస్టిస్ రమణ జోక్యం … జగన్ లేఖ 

ఏపీ హైకోర్టు లో జస్టిస్ రమణ జోక్యం … జగన్ లేఖ 

బహుశా దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి తమ రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకొంటూ,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు లు వచ్చేటట్లు చేస్తున్నారని అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ వ్రాసారు. 

ర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయని అంటూ  ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయిని  ఆ లేఖలో తీవ్ర ఆరోపణలు చేస్తూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేశారు. 

మూడు రోజుల క్రితం వ్రాసిన ఈ లేఖలోని వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం  గత రాత్రి మీడియాకు తెలిపారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి కొద్దీ నెలల్లో పదవీకాలం పూర్తికానుందున అందరికన్నా సీనియర్ గా ఆ పదవికి రమణ పేరును పరిశీలించే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఈ లేఖను వ్రాయడం ప్రాధాన్యతను సంతరింప చేసుకొంది.

రమణను ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకొనేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆస్తులను పోగేసుకున్నారని అంటూ పేర్కొన్నారు.  జస్టిస్‌ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా జగన్ వివరించారు.

వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని జగన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్‌ తన లేఖలో వివరించారు.