శాంతిభద్రతలపై మమతాను నివేదిక కోరిన గవర్నర్ 

రాష్ట్రంలోని శాంతిభద్రతలపై త్వరగా ఓ నివేదికను సమర్పించాలని పశ్చిమ బెంగాల్  గవర్నర్ ధన్కర్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీని కోరారు. ఈ విషయంపై అధికారులను ఆదేశించినా ఏమాత్రం స్పందన లేదని గవర్నర్ తీవ్రంగా మండిపడ్డారు.

 ‘‘రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ఓ నివేదిక సమర్పించాలి. ఏసీఎస్ ద్వారా నేను ఇప్పటికీ ఈ విషయాన్ని చేరువేశా.’’ అని గవర్నర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

కాగా,  అధికారులపై కూడా గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించా. అయినా ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గానీ స్పందించలేదని ధన్కర్ మండిపడ్డారు. 

బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల వరుస హత్యల నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ శాంతిభద్రతలపై ఓ నివేదిక సమర్పించాలని కోరుతున్నారు. 

ఇలా ఉండగా, కొలకత్తా పోలీసులపై బీజేపీ జాతీయ ప్రధానా కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన ‘చలో సచివాలయం’ ర్యాలీపై పోలీసులు బాంబులు విసిరి, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటనపై తాము న్యాయస్థానాన్ని ఆయన ప్రకటించారు.

మమతా నేతృత్వంలోని ప్రభుత్వం రెండు విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. తృణమూల్ కార్యర్తలకు ఓ విధానమని, బీజేపీ కార్యకర్తలకు మరో విధానమని ఆయన దుయ్యబట్టారు.

 హాథ్రస్ కేసును వ్యతిరేకిస్తూ టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీలో కోవిడ్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని, అయినా.. వారిపై ఎలాంటి కేసులూ లేవని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తున్న ఆందోళనలో పోలీసులు ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేశారు. 

“మా కార్యకర్తలపైకి బాంబులు విసిరి, మానవ హక్కులను ఉల్లంఘించారు. మా మహిళా కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఓ ప్రతిపక్ష నేతలతో వ్యవహరించే తీరు ఇదేనా?’’ అని విజయ వర్గీయ నిలదీశారు.