ఎన్నికల లోపు శశికళ విడుదలకు బ్రేక్!

ఎన్నికల లోపు శశికళ విడుదలకు బ్రేక్!
అక్రమాస్తుల కేసులో బెంగుళూరులో గల పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దిగవంత జయలలిత సన్నిహితురాలు  శశికళ జైలు శిక్ష ముగించుకొని త్వరలో విడుదల కాగలరని ఎదురు చూస్తున్నారు. 
 
అయితే వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు ఆమెను బైటకు రాకుండా చేయడం కోసం అక్కడ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
ఆమె వస్తే ఎన్నికలలో తన ఉనికిని చాటుకోవడం కోసం అన్నాడీఎంకేలో కలకలం సృష్టించే ప్రయత్నం చేయడం ద్వారా ప్రతిపక్షం డీఎంకేకు పరోక్ష సహకారం అందించవచ్చని అనుమానిస్తున్నారు. 
 
ఆ భయంతోనే ఎడమొఖం, పెడముఖంగా ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం రాజీపడి పళనిస్వామిని తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హడావుడిగా ప్రకటించారు. 
 
ఇటీవల అక్రమాస్తులకు సంబంధించిన జప్తు నోటీసులు ఒకదాని తరువాత మరొకటి జారీ చేస్తుండం ఈ సందర్భంగా గమనార్హం. 2021 జనవరిలో శశికళ శిక్షాకాలం ముగియగానే జరిమానా రూ.10 కోట్లు చెల్లింపు తరువాత శశికళ బయటకు రావలసి ఉంది.
సత్ప్రవర్తన కారణంగా నవంబర్ లోనే విడుదల కావచ్చని కూడా ఆమె మద్దతుదారులు భావించారు. అయితే ఈ విషయమై జైలు అధికారులు గుంభనంగా ఉంటున్నారు.
 
ఇటువంటి పరిస్థితుల్లో శశికళ అక్రమంగా సంపాదించారంటూ ఆస్తుల అటాచ్‌, షోకాజ్‌ నోటీసులు ఇటీవల కాలంలో ఒకదాని వెనుక మరొకటి వెలువడుతుండటం ఆమె మద్దతుదారులనే  కలవరపెడుతోంది. 
ఇదివరకే ఐటి రెండు విడతలుగా ఆస్తుల్ని జప్తు చేయగా, మూడో విడతగా రూ.2 వేల కోట్ల ఆస్తులను బుధవారం అటాచ్‌ చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఐటి శశికళకు సంబంధించిన రూ.3,900 కోట్ల విలువ గల ఆస్తులను జప్తు చేసింది.