బెంగాల్‌లో అల్‌ఖైదా లాంటి ఉగ్రసంస్థల ఉనికి 

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అల్‌ఖైదా లాంటి ఉగ్రసంస్థల ఉనికి రాష్ట్రంలో కనిపిస్తోందని ఆరోపించారు. జాతీయ భద్రతకు ఇది ప్రమాదకరమని హెచ్చరించారు.
 
దేశవ్యాప్తంగా ఆరుగురు అల్‌ఖైదా సానుభూతి పరులను అరెస్టు చేస్తే వారిలో ముగ్గురు పశ్చిమబెంగాల్‌కు చెందిన వారేనని ఆయన వెల్లడించారు. పోలీసులకు, రాష్ట్రంలోని భద్రతా సంస్థలకు వీటిపై కనీస సమాచారం తెలియకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తూ శాంతిభద్రత పరిరక్షణపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.