భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం    

భారీ వర్షంతో హైదరాబాద్ మరోసారి అతలాకుతలమైంది. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాలు లోతు నీటిలో ఎక్కడికక్కడే  ట్రాఫిక్ జామ్ అయింది. అత్యధికంగా 15.1 సీఎం కురిసిన ఈ వర్షం ఈ సీజన్లో అతి పెద్దదిగా చెబుతున్నారు. 

ఆఫీస్ ల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారులు తీవ్రమైన  ఇబ్బందులు పడ్డారు. సిటీలో ప్రధాన రహదారులన్ని వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయి వాటర్ లాగింగ్​ పాయింట్స్ ని క్లియర్ చేశారు.

ఇందులో ప్రధానంగా కూకట్​పల్లి నుంచి ఎల్బీనగర్ వెళ్లే రూట్ లో 11 ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరుకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది. 

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం రెండు గంటల పాటు భీకరంగా కురిసింది. రాత్రి 9 గంటల వరకు కూడా పలు చోట్ల వర్షం పడింది. ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి ఎదురుగా సికింద్రాబాద్ కోపరేటివ్ బ్యాంకు బుడగల అపార్ట్‌మెంట్‌లోకి  భారీగా వ‌ర్షం నీరు వ‌చ్చి చేరడంతో ఆ స‌మ‌యంలో రాజ్‌కుమార్ (54) అనే వ్య‌క్తి సెల్లార్‌లోనే చిక్కుకొని ఉండ‌టంతో ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా ఆసీఫ్ నగర్ లో 15.1 సెంటీమీటర్లు, షేక్ పేట్‌‌లో 12.7 సెం.మీ., గండిపేట్ లో 12.58 సెం.మీ., ఖైరతాబాద్ లో 12.3 సెం.మీ. నమోదైంది. అత్యల్పంగా ముషీరాబాద్ లో 6.35 సెం.మీ., హిమాయత్ నగర్ (కవాడిగూడ డంపింగ్ యార్డ్) లో 6.15, ముషీరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ఆఫీస్) 5.83, హిమాయత్ నగర్ (నారాయణగూడ) 5.83, చిలకలగూడ లో 5.83 సెంటీమీటర్లుగా నమోదైంది. 

బేగంపేట్, పంజాగుట్ట, టోలిచౌకి, సైఫాబాద్, నారాయణగూడ, ఆబిడ్స్,  సికింద్రాబాద్,  గోషామహల్, కాచిగూడ, నాంపల్లి, అసెంబ్లీ, బషీర్ బాగ్  తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.  సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్​భవన్​, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మైత్రివనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్  వంటి రూట్లలో భారీగా  ట్రాఫిక్ జామైంది. 

లేక్‌‌వ్యూ గెస్ట్‌‌ హౌజ్‌‌, లక్డీకాపూల్‌‌, అమీర్‌‌పేట మైత్రీవనం, కేసీపీ చౌరస్తాలు చెరువులను తలపించాయి. అంబర్ పేట్ అలీ కేఫ్ వద్ద భారీవానకు మూసారాంబాగ్ బ్రిడ్జీపైకి మూసీనది వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండి వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో జనం ఇబ్బంది పడ్డారు.

రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు,  ఒకటీరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం​ ఉందని పేర్కొంది.