నిమ్స్ భవనం వెంటనే ఎయిమ్స్ కు అప్పచెప్పండి 

తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ బిల్డింగ్ ని త్వరగా ఎయిమ్స్ కి అప్పగించాల‌ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. శ‌నివారం బీబీనగర్ ఎయిమ్స్ ని సందర్శించిన కిషన్ రెడ్డి.. అక్క‌డి అధికారులతో సమీక్షా సమావేశం జరిపి  ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ అనిత రామచంద్రన్ కు సూచించారు.
 
 ఇదివరకు ఢిల్లీలో మాత్రమే ఉండే ఎయిమ్స్ ను మోదీ  ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ సురక్ష పథకం కింద దేశంలో 9 ఎయిమ్స్ కేంద్రాలను ఏర్పాటు చేశార‌ని కిషన్ రెడ్డి చెప్పారు. ఎయిమ్స్ లో ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి? ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఎయిమ్స్ సందర్శించి, ఇక్కడి వైద్య సిబ్బంది తో సమీక్ష చేశామ‌ని తెలిపారు. 
 
ముందు 50 ఎకరాలు మాత్రమే ఎయిమ్స్ కి ఇచ్చార‌ని, రాష్ట్ర అధికారులతో మాట్లాడితే, ఇటీవలే 160 ఎకరాలు ఎయిమ్స్ కి అదనంగా కేటాయించారని పేర్కొన్నారు.  గత ఏడాది 50 మంది విద్యార్థులుతో మెడికల్ కళాశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైందని, రెండో ఏడాదికి 63 మంది జాయిన్ అయ్యారని చెప్పారు. 
 
ఎయిమ్స్ లో 750 ఎయిమ్స్ మెడికల్ , 200 పారా మెడికల్, 300 పీజీ విద్యార్థులు చదువుకునేలా , 300 సీనియర్ రెసిడెంట్స్ , 7 నుంచి 8 వందల మంది నర్సింగ్ స్టాఫ్ ఉండేలా తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు. ఇప్పటికే 150 మంది నర్సులను నియమించామ‌ని, మూడు వారాల్లో ఓపీ బ్లాక్ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఆయుష్ కి సంబంధించిన యోగ, ప్రాణాయామలాంటివి ఎయిమ్స్ లో ఏర్పాటు చేయనున్నా‌మ‌ని, బ్యాంక్, పోస్ట్ ఆఫీసు, డిపార్ట్మెంటల్ స్టోర్ , వైద్య సిబ్బంది నివాస సముదాయాలు లాంటి మౌలిక వసతులు కల్పించనున్నామ‌ని తెలిపారు. నియామ‌కాలు, పరికరాలు లాంటివి ఇంకా రావాల్సి ఉంద‌ని చెబుతూ ఎయిమ్స్ ని రీసెర్చ్ సెంటర్ లా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.