ఆర్ధిక విధానాల్లో కోర్టుల జోక్యం సరికాదు 

ఆర్థిక విధానాల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మారటోరియం కాలంలో రూ. 2 కోట్ల వరకు రుణాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని గత వారం కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
దీంతో కేంద్రం, భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ)లు సంయుక్తంగా మరో అఫిడవిట్‌ను దాఖలు చేశాయి. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, ఇందులో కోర్టుల జోక్యం తగదని పేర్కొంది. రుణ తాత్కాలిక నిషేధాన్ని పాలసీ ప్రకారం నిర్నయించే అధికారం బ్యాంకులకు వదిలివేయాలని ఆర్‌బిఐ తెలిపింది. 
 
వడ్డీపై వడ్డీ మాఫీ చేయడం కాకుండా మరే ఇతర ఉపశమనాలు కల్పించినా.. ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. కామత్‌ కమిటీ నివేదిక ప్రకారం.. కరోనా సమయంలో రంగాల వారీగా ఉపశమనం కల్పించడం కుదరదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.
 
ఉపశమనం కల్పించాలంటూ పిటిషన్‌లు దాఖలు చేయడం సరికాదని పేర్కొంది. రుణాలపై మారటోరియం గడువును మరికొంత కాలం పెంచడం కూడా కుదరదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. 
 
మారటోరియం గడువును పెంచితే వాయిదాల చెల్లింపుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, రుణగ్రహీతలపై భారం పెరుగుతుందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.