భారత్ చేరిన స్విస్ ఖాతాల రెండో జాబితా 

తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్న మనోళ్ల వివరాలను స్విట్జర్లాండ్​ పంపించింది. ఆటోమేటిక్​ ఎక్స్చేంజ్​ ఆఫ్  ఇన్ఫర్మేషన్​ (ఏఈఓఐ) ఒప్పందంలో భాగంగా స్విస్ సర్కారు ఈ జాబితా​ను అందించింది. 

విదేశాల్లో దాచిన బ్లాక్​మనీపై పోరాటంలో భాగంగా కేంద్రం చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ వివరాలను అందుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విదేశాల్లో దాచిన నల్లధనంపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి ఇది మరో కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 

గత ఏడాది సెప్టెంబరులో భారత్‌ తొలి జాబితాను అందుకుంది. వచ్చే ఏడాది మరో జాబితా రానుంది.ఇందుకోసం స్విట్జర్లాండ్​ ప్రభుత్వంతో ఇన్ఫర్మేషన్​ ఎక్చేంజ్​ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 86 దేశాలతో స్విట్జర్లాండ్​ ఈ ఒప్పందం చేసుకుంది.

2018 వరకు యాక్టివ్​గా ఉన్న, క్లోజ్​ చేసిన ఖాతాల వివరాలను ఈ జాబితాలో పంపించింది. అంతకుముందు కూడా భారత్ కోర్కె  మేరకు వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వంద మంది ఖాతాల వివరాలను అందజేసినట్లు స్విస్​ అధికారులు తెలిపారు.

కాగా భారత్‌కు అందిన సమాచారం ఆధారంగా పన్ను చెల్లింపుదారులు తమ టాక్స్‌ రిటర్నులలో ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా ప్రకటించారా లేదా అన్నది పన్ను శాఖ అధికారులు ధ్రువీకరించుకోనున్నారు.  

ఇక, ఈ ఏడాది మొత్తం 75 దేశాలకు చెందిన 31 లక్షల వ్యక్తులు, సంస్థల ఖాతాల వివరాలను ఆయా దేశాలకు వెల్లడిస్తామని ఫెడరల్​ ట్యాక్స్​ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​టీఏ) వెల్లడించింది.