బ‌్యాంకు ఖతాదారులకు నగదు బదిలీలకు సంబంధించిన ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్)’ సేవలను కస్టమర్లకు ఇక నుంచి 24 గంటలు అందుబాటులో ఉంచనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ 24×7 ఆర్‌టీజీఎస్ సేవలు వచ్చే డిసెంబర్ నుంచి అమలులోకి వస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.
ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం నగదు బదిలీలకు సంబంధించి ఎంతో మంది కస్టమర్లకు వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు బ్యాంక్ వర్కింగ్ డేస్‌లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే మళ్లీ ఉదయం 7 గంటల వరకు ఈ సేవలు పొందే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ 24 గంటలు ఆర్‌టీజీఎస్ సేవలు అందించాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో నెఫ్ట్ సేవలు కూడా పరిమిత వేళల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే గత ఏడాది డిసెంబర్ 16 నుంచి నెఫ్ట్ సేవలను 24 గంటలపాటు అందుబాటులోకి తెచ్చారు.
అయితే, నెఫ్ట్ ద్వారా రెండు లక్షలు అంతకులోపు నగదును మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి నగదు బదిలీ చేయాలంటే ఆర్‌టీజీఎస్ సేవలు వినియోగించాల్సిందే. అంతేగాక నెఫ్ట్‌లో గంటకు ఒకసారి మాత్రమే క్లియరెన్స్ ఉంటుంది.
అంటే మనం బదిలీ చేసే నగదుకు గరిష్టంగా గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే ఆర్‌టీజీఎస్‌లో అయితే ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ జరిగిపోతుంది.
ప్రస్తుతం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆర్‌టీజీఎస్ అందుబాటులో లేకపోవడంతో ఆ వేళల్లో రూ.2,00,000 మించి నగదు బదిలీ చేయాలనుకునే ఖాతాదారులు, తక్షణమే నగదు క్లియరెన్స్ అవసరమైన ఖాతాదారులు ఇబ్బంది పడేవారు.
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అయితే, రూ.2 లక్షలు ఆ లోపు నగదు బదిలీలు అవసరమైన ఖాతాదారులకు మాత్రం ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సంబంధం లేదు.
More Stories
రెండో అతిపెద్ద 5 జి స్మార్ట్ఫోన్ మార్కెట్గా భారత్
సగానికి పైగా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకే
భారత్ స్వయంగా అనేక ‘సింగ్పూర్’లను సృష్టిస్తోంది