నేషనల్ డే సంబరాలకు తైవాన్ … మండిపడుతున్న చైనా 

అక్టోబర్ 19న నేషనల్ డే సంబరాలను జరుపుకోవడం ద్వారా తమది స్వతంత్ర దేశమని చాటుకోవడానికి ఒక వంక తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌ సన్నాహాలు చేస్తుండగా, మరోవంక అది తమ దేశంలో భాగమే అంటూ చైనా మండిపడుతున్నది. 

నేషనల్‌ డే ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైన త్సాయి ప్రభుత్వం ఇందుకు సంబంధించి పలు మీడియాలో ప్రకటనలు విడుదల చేసింది. ఇందులో భాగంగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వార్తా పత్రికలు ప్రకటనలు (పూర్తి పేజీ ప్రచురితం చేశాయి. త్సాయి ఇంగ్‌- వెన్‌ ఫొటోతో పాటు.. ‘‘తైవాన్‌- భారత్‌ సహజ మిత్రులు’’అనే నినాదం కూడా ఇందులో దర్శనమిచ్చింది. కోవిడ్‌- 19పై పోరులో పరస్పరం సహకరించుకున్నామన్న ఉద్దేశంతో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది

2016లో త్సాయి ఇంగ్‌‌- వెన్‌ తైవాన్‌ తొలిసారి అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే, చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తైవాన్‌ను వేరు చేసే ఏ చర్యను తాము సహించబోమని చైనా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. 

ఇక జనవరిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన త్సాయి ఇంగ్‌‌- వెన్‌.. ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలకు, స్వాతంత్ర్య కాంక్షకు కట్టుబడే ఉన్నాం. బీజింగ్‌ అధికారులు చెప్పే మాటలను తైవాన్‌ ఎన్నటికీ అంగీకరించబోదు. మన సార్వభౌమత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ ఇవ్వదు’’ అంటూ మరోసారి తమ వైఖరిని స్పష్టం చేశారు. 

అంతేగాక అగ్రరాజ్యం అమెరికాతో సహా భారత్‌ వంటి పలు ప్రధాన దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసి చైనాకు కంట్లో నలుసులా తయారయ్యారు.

ఇప్పటికే త్సాయి ఇంగ్‌- వెన్‌పై భగ్గుమంటున్న చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఏకంగా భారత్‌తో బంధాన్ని చాటుతూ తైవాన్ వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం, భారత మీడియా సంస్థలను ఉద్దేశించి బుధవారం ఓ లేఖను విడుదల చేసింది.

‘‘సోకాల్డ్‌ ‘‘నేషనల్‌ డే ఆఫ్‌ తైవాన్‌’’ సమీపిస్తున్న సందర్భంగా మీడియా మిత్రులకు ఓ విజ్ఞప్తి చేయదలచుకున్నాం. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క చైనా ఉంది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వమే చైనా భూభాగమంతటినీ పాలిస్తోంది. తైవాన్‌ కూడా చైనా భూభాగంలో అంతర్భాగం. కాబట్టి మాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ కూడా ‘‘వన్‌- చైనా పాలసీ’’ని గౌరవస్తాయని, మా విధానం పట్ల నిబద్ధతను కలిగి ఉంటాయని ఆశిస్తున్నాం” అంటూ పేర్కొన్నది. 

పైగా, భారత ప్రభుత్వంతో కూడా తమకు  అధికారిక దౌత్య సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా చైనా గుర్తు చేసింది. కాబట్టి భారత మీడియా కూడా ప్రభుత్వ విధానాలకు కట్టుబడి తైవాన్‌ విషయంలో చైనా అనుసరిస్తున్న విధానాలను ఉల్లంఘించదని భావిస్తున్నామని అంటూ ముఖ్యంగా తైవాన్‌ను దేశంగా(నేషన్‌) అభివర్ణిస్తూ, అధ్యక్షురాలు వంటి పదాలు ఉపయోగిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపవద్దని విజ్ఞప్తి చేసింది. 

తమ గురించి మీడియాను ఉద్దేశించి చైనా ఎంబసీ రాసిన లేఖపై తైవాన్‌ విదేశాంగ మంత్రి జౌషిష్‌ జోసెఫ్‌ వూ ఘాటుగా స్పందించారు. ‘‘ఈ భూమీ మీద ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధానాలను ప్రేమించే ప్రజలు ఉంటారు. కానీ చైనా వంటి కమ్యూనిస్టు దేశం మాత్రం ఉపఖండ మీడియాపై సెన్సార్‌షిప్‌ విధించాలని చూస్తోంది. తైవాన్‌కు ఉన్న భారత స్నేహితులు ఇందుకు ఇచ్చే సమాధానం ఒక్కటే: గెట్‌ లాస్ట్‌!’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

కాగా తైవాన్‌తో భారత్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ, న్యూఢిల్లీలో తైపీ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఉంది. అంతేగాక తైపీలో ఉన్న భారత్- తైపీ అసోసియేషన్‌ టూరిజం, వ్యాపారం, వాణిజ్యం తదితర అంశాలను ప్రమోట్‌ చేస్తూ పలు భిన్న కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది.

మరోవంక, ‘‘తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మాకు శుభాకాంక్షలు తెలిపే వారందరికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఎన్నో కష్టనష్టాలకోర్చి స్వాత్రంత్ర్యం పొందిన ఆ రోజును పండుగలా నిర్వహించుకుంటాం. ప్రజాస్వామ్య దేశంగా మేం సాధించిన విజయాలను ఆస్వాదిస్తాం. మాతో పాటు మీరు ఇందులో భాగస్వాములు అవ్వండి. తైవాన్‌ ఎదుగుదల పట్ల మీరు కూడా గర్విస్తున్నారని ఇక్కడ తెలియజేయండి’’ అంటూ తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌ నెటిజన్లను ఆహ్వానించారు.