కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ (74) గత రాత్రి క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న‌ కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్ప‌త్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. 

పాశ్వాన్ గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. తన తండ్రి మరణం గురించి లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ.. “పాపా… ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు కానీ మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ నాతోనే ఉంటార‌ని తెలుసు. మిస్ యు పాపా అని పేర్కొన్నారు.

పాశ్వాన్‌ హఠాత్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్‌జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు.

తండ్రి ఆరోగ్యం గురించి ఇటీవ‌లే చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ… గత కొన్ని రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా అర్ధరాత్రి సమయంలో గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే మ‌రికొన్ని వారాల తర్వాత కూడా మరొక ఆపరేషన్ నిర్వహించాల్సి రావ‌చ్చు. ఈ పోరాటంలో త‌న‌కు, త‌న కుటుంబానికి అండగా నిలిచిన ప్ర‌తీఒక్క‌రికీ ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. 

బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన పాసవాన్ ఐదు దశాబద్దాలగా రాజీయాల్లో ఉన్నారు.  దేశంలో ప్రముఖ దళిత నేతల్లో ఆయన ఒకరు. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ బీహార్‌లోని ఖగారియా జిల్లా శహర్‌బన్ని గ్రామంలో 1946 జూలై 5న నిరుపేద దళిత కుటుంబంలో జమున్‌ పాశ్వాన్‌, సియాదేవి దంపతులకు జన్మించారు.

1969లో సోషలిస్టు పార్టీ తరఫున మొదటిసారి బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977 పార్లమెంట్‌ ఎన్నికల్లో జనతాపార్టీ తరఫున హాజీపూర్‌ నుంచి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. 1980, 89, 96, 98, 99, 2004, 2014లో వరుసగా హాజీపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2000లో జనతాదళ్‌ నుంచి బయటకు వచ్చి ఎల్జేపీని నెలకొల్పారు. 

ఆయన ఐదుగురు ప్రధానులతో కలిసి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుదైన ఘనత సాధించారు. 1996 నుంచి 2015 వరకు కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో భాగస్వామి అయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 

రాం విలాస్ పాశ్వాన్ మృతి ప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. రాం విలాస్ పాశ్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందని రాష్ట్రపతి ట్వీట్ లో పేర్కొన్నారు. పార్లమెంటులో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరని గుర్తు చేశారు. అత్యంత చురుకైన వ్య‌క్తి అని కొనియాడారు. 

అణగారినవర్గాల గొంతుక, అట్టడుగున ఉన్నవారికి ఉన్న‌తికి కృషిచేసిన వ్య‌క్తి అని తెలుపుతూ యువతలో ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్, ఎమ‌ర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ సమయంలో జయప్రకాష్ నారాయణ్ వంటి మెంటార్‌ల‌ను క‌లిగిన వ్య‌క్తి, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తీవ్రంగా శ్ర‌మించాడని రాష్ట్రపతి నివాళులు అర్పించారు. పాశ్వ‌న్ మృతిప‌ట్ల ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. 

ప్ర‌ధాని మోదీ స్పందిస్తూ మంచి మిత్రుడు, గొప్ప స‌హ‌చ‌రుడిని కోల్పోయాన‌ని విచారం వ్యక్తం చేశారు. పేద‌లు హుందాగా జీవించ‌డానికి నిరంత‌రం కృషి చేసిన వ్య‌క్తి అన్నాఅని కొనియాడారు. యువ నాయకుడిగా అతను ఎమ‌ర్జెన్సీ సమయంలో దౌర్జన్యాన్ని, మన ప్రజాస్వామ్యంపై దాడిని ప్రతిఘటించాడని తెలిపారు. కేబినెట్ సమావేశాల సందర్భంగా ఆయన స‌ల‌హాలు ఎంతో ఉప‌యుక్త‌మని గుర్తు చేసుకొంటూ ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్ర‌ధాని సంతాపం తెలిపారు.