బీమా కోరేగావ్ కేసులో స్టాన్ స్వామి అరెస్టు

మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బీమా కోరేగావ్ అల్ల‌ర్ల కేసులో 83 ఏళ్ల క్రైస్త‌వ పూజారి స్టాన్ స్వామిని ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు.  బీమాకోరేగావ్ గ్రామంలో 2018లో హింస చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గిరిజ‌న హ‌క్కుల కోసం పోరాటం చేసే ఫాద‌ర్ స్టాన్ స్వామిని  రాంచీలో అదుపులోకి తీసుకున్నారు. 
 
20 నిమిషాల పాటు అక్క‌డ గ‌డిపిన ఎన్ఐఏ పోలీసులు ఆ త‌ర్వాత ఆయ‌న్ను త‌మ వెంట తీసుకువెళ్లారు.  బీమాకోరేగావ్ కేసులోనే గ‌తంలో ప‌లుమార్లు పోలీసులు స్టాన్‌స్వామిని విచారించారు.  కేర‌ళ‌కు చెందిన స్టాన్ స్వామి ఆదివాసీ హ‌క్కుల కోసం జార్ఖండ్‌లో అయిదు ద‌శాబ్ధాల నుంచి పోరాటం చేస్తున్నారు. 
 
ఇప్ప‌టికే ఈ కేసులో వ‌ర‌వ‌ర‌రావు, సుధా భ‌ర‌ద్వాజ్ లాంటి పలువురు జైలు జీవితం అనుభ‌విస్తున్నారు.  డిసెంబ‌ర్ 31, 2017లో పుణెలో జ‌రిగిన ఓ కార్యక్ర‌మం త‌ర్వాత రోజు మ‌హారాష్ట్ర భారీ స్థాయిలో అల్ల‌ర్లు జ‌రిగాయి. ఆ హింస‌లో ఓ వ్య‌క్తి మృతిచెందారు.
 
ఎల్గ‌ర్ ప‌రిష‌త్ స‌మావేశ నిర్వ‌హ‌కులు విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేయ‌డం వ‌ల్ల హింస చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కూడా కుట్ర ప‌న్నిన‌ట్లు కొంద‌రిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.