మాస్కు ధ‌రిద్దాం.. క‌రోనాను త‌రిమేద్దాం

దేశంలో విల‌య‌తాండ‌వం సృష్టిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను క‌లిసిక‌ట్టుగా త‌రిమేద్దామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌జ‌ల్లో భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్రం జ‌న్ ఆందోళ‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన మోదీ ట్వీట్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోవాల‌ని ప్ర‌ధాని విజ్ఞ‌ప్తి చేశారు. 

ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి.. భౌతిక దూరాన్ని పాటించాల‌న్నారు. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. ఇద్ద‌రి మ‌ధ్య‌ రెండు గ‌జాల దూరం ఉండేలా ప్రాక్టీస్ చేయండి. ఈ నియ‌మాలు పాటించి క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని మోదీ పిలుపునిచ్చారు. రాబోయే పండుగలు, శీతాకాలంతో పాటు ఇతర కార్యకలాపాల దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.

ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఇందులో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమష్టి కార్యాచరణను అమలు చేయనున్నారు. అత్యధిక కేసులున్న జిల్లాలో నిర్ధిష్ట కమ్యూనికేషన్‌, ప్రతి పౌరుడికి చేరుకోవడానికి సరళమైన, సులభంగా అర్థమయ్యే సందేశాలు, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రచారంలో హోర్డింగ్‌లు, వాల్ పెయింటింగ్‌లు, ప్రభుత్వ ప్రాంగణంలో ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు, సందేశాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు స్థానిక, జాతీయస్థాయిలో ప్రభావవంతమైన వ్యక్తులతో సైతం ప్రచారం చేపట్టనున్నారు. మొబైల్‌ వాహనాల ద్వారా ఆడియో సందేశాలు, కరపత్రాలు, బ్రోచర్‌లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కొవిడ్ సందేశాలను అమలు చేయడానికి స్థానిక కేబుల్ ఆపరేటర్ల మద్దతు కూడా తీసుకోనున్నారు.