బెంగాల్ లో బిజెపి కార్యకర్తలపై టియర్ గ్యాస్

బెంగాల్ లో బిజెపి కార్యకర్తలపై టియర్ గ్యాస్

కోల్‌కతాలో బిజెపి కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తల ఆందోళనలతో గురువారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్టోబర్ 4న జరిగిన బిజెపి కౌన్సెలర్ మనీష్ శుక్లా హత్యతో పాటు రాష్ట్రంలో బీజేపీ నేతలపై జరుగుతున్న వరుస హత్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ చలో ‘నబన్నా’ పేరుతో బిజెపి సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది.

ర్యాలీలో భాగంగా న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున న‌బ‌న్నాలోని స‌చివాల‌యానికి చేరుకోవాల‌ని భావించారు. అయితే, పోలీసులు వారిని ఎక్క‌డిక‌క్క‌డే అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. సెంట్ర‌ల్ కోల్‌క‌తా, హేస్టింగ్స్, హౌరా త‌దిత‌ర ప్రాంతాల్లో నిర‌స‌న‌కారుల‌పై పోలీసులు లాఠీచార్జి చేశారు.

సచివాలయం భవనమైన నబన్నాకు సమీపంలోని బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌‌కు దిగారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్‌‌ను కూడా ప్రయోగించారు.

‘పోలీసులు మా కార్యకర్తలపై లాఠీచార్జ్ చేస్తున్నారు. ఖిదిర్‌‌పూర్ వైపు నుంచి మాపై రాళ్లు రువ్వుతున్నారు. ఇది పోలీసులకు కనిపించడం లేదా?’ అని బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు  రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతోతోపాటు పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. 

పోలీసులు నిరసనలను అణచివేయడంతో హౌరా జిల్లాలో బీజేపీ కార్యకర్తలు టైర్లు తగులబెట్టారు.శాంతియుతంగా జ‌రుగుతున్న ర్యాలీని అడ్డ‌గించి ప్ర‌భుత్వమే హింసాత్మ‌కంగా మార్చిందని బెంగాల్ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి కైలాష్ విజ‌య్‌‌వ‌ర్గీయ ఆరోపించారు. పోలీస్ గుండాలే ప‌క్కా ప్లాన్‌తో నిర‌స‌న‌కారుల్లో చేరి రాళ్లు రువ్వార‌ని, ఆ వంకతో నిర‌స‌న‌కారుల‌పై లాఠీచార్జి చేసి ప‌రిస్థితిని హింసాత్మ‌కంగా మార్చార‌ని మండిపడ్డారు.

అదేవిధంగా నిర‌స‌న పేరుతో బీజేపీ క‌రోనా నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కింద‌న్న తృణ‌మూల్‌ విమ‌ర్శ‌లను కూడా ఆయ‌న తిప్పికొట్టారు. ర్యాలీలో పాల్గొన్న కార్య‌క‌ర్త‌లంద‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జియే క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించి భారీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని ఆరోపించారు. ఆమెకు క‌రోనా నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వా..? అని విజ‌య్ వ‌ర్గీయ ప్ర‌శ్నించారు.         ‌