స్పీకర్ తమ్మినేని వాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హితవుపలికింది. 

హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని హెచ్చరించింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా నెలకొనలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.  

‌తమ్మినేని సీతారాంతో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపిలు నందిగం సురేష్‌, విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించాయని, వీరి వ్యాఖ్యలను కోర్టులపై దాడులుగా పరిగణించాల్సి ఉంటుందని ఎపి హైకోర్టు స్పష్టం చేసింది. 

రాజధాని తరలింపు, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పులు వెలువరిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే అలాంటి తీర్పులు ఇస్తున్నారని ఇటీవల న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై సోషల్‌ మీడియాలో వీరు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై  హైకోర్లు విచారణ జరిపింది. 

ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు.. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. వాళ్లను రక్షించడానికే కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. 

స్పీకర్‌ వ్యాఖ్యలు ఎక్కడ (శాసనసభ? లేక బయట?) చేశారని కోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై చేశారని స్టాండింగ్‌ కమిటీ న్యాయవాది గుర్తు చేశారు. విచారణలో సిఐడి విఫలమైతే సిబిఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 

దీనిపై ఎజి స్పందిస్తూ.. సిబిఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న అభిప్రాయాన్ని ఎజి, సిఐడి న్యాయవాది అంగీకరించారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.