‘రాజధాని’ పిటిషన్లపై నేటి నుంచి రోజువారీ విచారణ

రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్ల దాఖలైన అనుబంధ పిటిషన్లపై మంగళవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రోజువారీ విచారణ చేపట్టాలని ఏపీ హైకోర్టు నిర్ణయించింది.  

వీటి తర్వాత ప్రధాన పిటిషన్లపై భౌతిక విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాజధానిపై కమిటీలు రూపొందించిన నివేదికలు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు తదితరాలను సవాల్‌ చేస్తూ దాఖలైన మొత్తం 101 పిటిషన్లపై సోమవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సులభతర విచారణపై కోర్టు దృష్టిసారించి అంశాల వారీగా పిటిషన్లను విభజించింది.

 మొత్తం పిటిషన్లలో 229 అనుబంధ పిటిషన్లు ఉండగా, అందులో 183 అనుబంధ పిటిషన్లు రాజధాని తరలింపును అడ్డుకోవాలంటూ దాఖలైనవిగా తేల్చింది. అదేవిధంగా తరలింపుపై ఉన్న స్టేటస్‌ కోను ఎత్తివేయాలని కోరుతూ మరో రెండు అనుబంధ పిటిషన్లు దాఖలైనట్లు తెలిపింది.

కేటగిరీల వారీగా విభజించిన వాటిల్లో 44 అనుబంధ పిటిషన్లపై తొలిగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇరు పక్షాల న్యాయవాదుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులందరికీ వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తామని పేర్కొంది. 

ఇందులో భాగంగా అభ్యర్థనల వారీగా అనుబంధ పిటిషన్లను విభజించాలని, ఆ మేరకు విచారణ తేదీల వివరాలన పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు తెలియజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రాజధానికి సంబంధించిన అంశాల్లో తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు స్టేట్‌సకో (యథాతథ స్థితి) కొనసాగుతుందని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

విచారణ సందర్భంగా ముందుగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితేష్‌ గుప్తా వాదలు వినిపిస్తూ విశాఖ గ్రేహౌండ్స్‌ కొండపై రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహాన్ని నిర్మించడాన్ని సవాల్‌ చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌లో సమగ్ర వివరాలు పొందుపరచలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

 తిరుపతి, కాకినాడల్లో చిన్నపాటి అతిథి గృహాలు నిర్మిస్తున్న ప్రభుత్వం విశాఖలో 30 ఎకరాల్లో భారీ అతిథి గృహాన్ని నిర్మిస్తోందని తెలిపారు. దాని ఖర్చు, ఇతర వివరాలేవీ కౌంటర్‌లో పేర్కొనలేదన్నారు. కార్యనిర్వాహక రాజధానిని తరలింపు ప్రక్రియలో భాగంగానే ఆ నిర్మాణం చేపట్టిందని, ప్రభుత్వ కౌంటర్‌కు తిరుగు సమాధానం ఇస్తామని  పేర్కొన్నారు. 

అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం బదులిస్తూ పిటిషన్‌లో పేర్కొనని అంశాలను ధర్మాసనం ముందు ప్రస్తావిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. రాజధానికి, విశాఖ అతిథి గృహానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ పిటిషన్లలో కాగ్‌ను ప్రతివాదిగా చేర్చడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. 

రాజధానిలో దాదాపు నిర్మానం పూర్తికావచ్చిన 5,024 గృహాలను పూర్తి చేసి, లబ్ధిదారులకు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై  త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది. తమ పిటిషన్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌంటర్‌ దాఖలు చేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు తెలిపారు.

కౌంటర్‌ దాఖలుకు ఏజీ గడువు కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. కాగా.. రాజధాని పిటిషన్లలో ఇళ్ల స్థలాలకు సంబంధించినవి ఆరు ఉన్నాయని, నిజానికి ఈ వ్యవహారంతో ఆ పిటిషన్లకు సంబంధం లేదని ఏజీ తెలిపారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వాటిని ఈ జాబితా నుంచి తొలగించింది.