ఏపీలో మరో శిరోముండనం ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన శిరోముండనం ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తీసుకున్న అప్పు తీర్చలేదంటూ ఓ యువకుడిని కారులో బలవంతగా తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

జంగారెడ్డిగూడెం ఎస్సై కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడేనికి చెందిన అలక అభిలాష్‌ (23) జంగారెడ్డిగూడేనికి చెందిన యర్రసాని విజయ్‌బాబు వద్ద మూడు నెలల క్రితం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ బాకీని తీర్చాలంటూ విజయ్‌బాబు గత మూడు రోజులుగా అభిలాష్‌ని అడుగుతున్నాడు.

ఇదే విషయమై అక్టోబర్‌ 3వ తేదీన రాత్రి విజయ్‌బాబు, తన మిత్రులు షేక్‌ నాగూల్‌ మీరావళి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి అభిలాష్‌ను కారులో ఎక్కించుకుని నేరగా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచారు.

తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో మరో వ్యక్తితో అభిలాష్‌కు శిరోముండనం చేయించారు. అనంతరం బాధితుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం అభిలాష్‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు.

 
ఇలా ఉండగా, శిరోముండనం బాధితుడు అభిలాష్‌ను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించిన్నట్లు చెబుతున్నారు. గత రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బాధితుడు స్వగ్రామం తాడేపల్లిగూడెంకు వచ్చిన పోలీసులు రెండు జతల బట్టలు తీసుకురమ్మని బాధితుడికి సూచించారు.  
 
బట్టలు తీసుకు వచ్చిన వెంటనే అక్కడ నుంచి అభిలాష్‌‌ను రహస్య ప్రాంతానికి తరలించారు.  కొన్ని రోజులు అభిలాష్ తమ దగ్గరే ఉంటాడని బంధువులకు పోలీసులు వెల్లడించారు.