మహిళలపై దాడుల్లో ఎపిది 8వ స్థానం

దేశ వ్యాప్తంగా నమోదైన నేరాల రేటులో ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉందని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి) నివేదికలో వెల్లడైంది. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న దాడుల్లో కూడా ఎపి ఎనిమిదో స్థానంలో ఉంది. 2018తో పోలిస్తే 2019లో రాష్ట్రంలో మహిళలపై 7 శాతం నేరాలు పెరిగాయి.

అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2019లో ఐపిసి సెక్షన్‌ కింది గుర్తించదగిన నేరాల్లో 6.2 శాతం తగ్గుదల కనిపించింది. మొత్తం మీద, దేశంలో ఐపిసి గుర్తించిన నేరాల్లో 3.7 శాతం రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రత్యేక..లోకల్‌ చట్టాల కింద పోలీసులు నమోదు చేస్తున్న కేసుల సంఖ్య ఎపిలో 2019లో 46 శాతం పెరిగింది. 

గత ఏడాదితో పోల్చుకుంటే హత్య కేసులు 7శాతం తగ్గాయి. రోజులో రాష్ట్రంలో రెండు కేసులు నమోదు అవుతున్నాయని ఎన్‌సిఆర్‌బి డేటాలో వెల్లడైంది. ఆస్తి, కుటుంబ తగాదాలు, డబ్బు, చిన్న సమస్యలకు సంబంధించిన వివాదాల్లో 369 హత్య కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో అక్రమ సంబంధాల కారణంగా 164 హత్యలు జరిగాయి.

 అంతేకాకుండా వ్యక్తిగత కక్ష, శత్రుత్వం కారణంగా 56 హత్యలు చోటుచేసుకున్నాయి. మహిళలపై నమోదైన కేసుల సంఖ్య 17, 746 కేసులు కాగా, లైంగిక వేధింపుల సంఖ్య 4,444గా ఉన్నాయి. ఎపిలో అత్యాచారాలు గత ఏడాది 1,086తో పోలిస్తే..ఈ ఏడాది అవి 1,104 పెరిగాయి. 

దక్షిణ భారత దేశంలో ఎస్‌సిలపై దాడులకు వ్యతిరేకంగా అత్యధికంగా నమోదవుతున్నది (2,071) ఎపిలోనే అని తేలింది. గిరిజన మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసుల సంఖ్య 22 కాగా, చిన్నారులపై లైంగిక వేధింపు కేసుల సంఖ్య 502గా ఉన్నాయి. శిక్షలు విధించడంలో ఎపి 12వ ర్యాంకులో ఉంది. 63.4 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.