ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వసం 

ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది. శృంగేరి మఠం సమీపంలోని ఓ కాలేజీలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి.. బాటిళ్లతో దుండగులు కొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

కర్నూలు జిల్లా ఆదోనిలో దుండగులు రెచ్చిపోయారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తెల్లవారుజామున పూజలకు వచ్చిన అర్చకులు విగ్రహ ధ్వంసాన్ని గ్రహించి స్థానికులకు తెలియజేశారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న వరుస విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు.

మరోవంక తెలంగాణ ఆదిలాబాద్‌లోని చాముండేశ్వరి ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఆలయంలోకి దర్జాగా ప్రవేశించిన దొంగలు.. తొలుత హుండీని పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. 

తర్వాత అమ్మవారి ఆలయం తలుపులు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు. అమ్మవారి కిరీటం, ఇతర ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.