సరిహద్దుల్లో చైనా సేనలకు పాక్ శిక్షణ!

సరిహద్దులలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మధ్య నిలబడి పాకిస్థాన్ సైనికుడు ఒకరు సైనికవిన్యాసాలకు దిగుతున్నవైనం ఇప్పుడు వీడియో సాక్షాధారాలతో నెట్‌లో ప్రచారం పొందింది. ఈ వీడియోను చైనాకు చెందిన ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో పెట్టారు. 

ఎల్‌ఎసి వెంబడి చెందిన పర్వత ప్రాంత యుద్ధ బలగాలు ఎదుటి పక్షం చైనా కన్నా అన్ని విధాలుగా బలోపేతంగా ఉంటూ వస్తోంది. ప్రత్యేకించి కొండశిఖరాలలో యుద్ధతంత్రంలో మన బలగాలదే పైచేయిగా ఉంటోంది. దీనితో ఇప్పుడు చైనా పాకిస్థాన్ సైనిక బలగాలు పరస్పర ం సహకరించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. 

ఎల్‌ఎసి వెంబడి ఓ చోట చైనా బలగాల కవాతు జరిగింది. సాధారణంగా చైనా జాతీయుల ముఖకవళికలు వేరుగా ఉంటాయి. అయితే వీరి మధ్య కొట్టొచ్చేరీతిలో గడ్డంతో ఉండే వ్యక్తి నిల్చుని ఉన్నాడు. భారత్‌ను తగు విధంగా ఎదుర్కొనేందుకు ఇక్కడ జరుగుతున్న పలు రకాల కసరత్తుల నడుమ ఈ గడ్డపు వ్యక్తి ఉన్నట్లు తెలిపే 52 సెకండ్ల వీడియో ఇప్పుడు సంచలనానికి దారితీసింది. 

ఈ వ్యక్తి చైనావాడు కాకుండా ఇతర దేశపు వ్యక్తి అనే విషయం సుస్పష్టం అయింది. ఓ వైపు చైనా వాణిజ్యరాదారి నిర్మాణానికి పాకిస్థాన్ ఆ దేశ ఒత్తిడికి అనుగుణంగా గిల్గిట్ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించడం, భారత్‌కు కుంపటిగా ఈ ప్రాంతాన్ని సిద్ధం చేయడం చేస్తూ ఉండగానే, భారత్ సైన్యం లొసుగులను బలాలను పూర్తిస్థాయిలో పసికట్టి ఉన్న పాకిస్థాన్ సేనల సాయం పూర్తిగా తీసుకునేందుకు చైనా రంగం సిద్ధం చేసుకుంది. 

సాధారణంగా చైనా సైనికులు పొట్టివారు, అయితే చిన్నపాటి గడ్డంతో చైనా సైనికులతో పాటు ఉన్న వ్యక్తి పొడుగ్గా బలిష్టంగా ఉన్నాడు. ఈ వ్యక్తి పాకిస్థానీ సుశిక్షిత సైనికుడు అని, ప్రత్యేకించి కొండల్లో జరిగే యుద్ధాలు, భారత్ సైనిక శక్తిసామర్థాలు తెలిసిన వ్యక్తిగా భావిస్తున్నారు. చైనా సైనికులకు ఈ ప్రాంతంలో ధీటుగా వ్యవహరించేందుకు వీలైన శిక్షణ కార్యక్రమంలో ఈ సైనికుడు సహకరిస్తున్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా భారతీయ అధికారవర్గాలు పసికట్టాయి. 

జూన్‌లోనే చైనా సైనిక నిపుణుడు ఒకరు భారత్ పర్వత యుద్ధ తంత్ర నైపుణ్యాన్ని కొనియాడారు, అత్యంత ఎతైన కొండశిఖరాల ప్రాంతంలో తగు విధంగా యుద్ధానికి దాడులకు భారత్ సేనలు తగు విధంగా తర్ఫీదు పొందాయని ఈ విషయంలో తాము వెనుకబడ్డామని కూడా ఈ నిపుణుడు తెలిపారు. 

దీనితో ఇప్పుడు ఇక్కడి అన్ని విషయాలు భౌగోళిక పరిస్థితులు తెలిసిన పాకిస్థాన్ సైనికుల నుంచి పిఎల్‌ఎకు తగు శిక్షణ అందుతోందని ఇప్పటి వీడియోతో వెల్లడైంది. దీనికి చాలా కాలం ముందునుంచే పాకిస్థాన్ సేనలు చైనా బలగాలు పలు విషయాల్లో సహకరించుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే వీడియో సాక్షాధారంతో ఈ విషయం ఇప్పుడు స్పష్టం అయింది.