జూలై నాటికి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్

కరోనా వాక్సిన్ సిద్ధం కాగానే దానిని ‘న్యాయబద్ధంగా, సమానంగా’ అందరికీ పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్  హామీ ఇచ్చారు. జూలై 2021 నాటికి 20 నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. 
 
 ‘కరోనా వ్యాక్తిన్ ఎప్పుడు సిద్ధం అయినా ఎలాంటి అరమరికలు లేని విధంగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం అహరహం కష్టపడుతుంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతాంశంగా ఉంటుంది’ అని మంత్రి ‘సండే సంవాద్’లో వివరించారు. 
 
వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని అంశాలనూ అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ చూసుకుంటోందని, జూలై 2021 నాటికి సుమారు 25 కోట్ల మందికి 400 నుంచి 500 మిలియన్ల డోస్‌లు అందుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. క్లినికల్ ట్రయిల్స్ 2020 మొదటి త్రైమాసంలో పూర్తవుతాయన్న ఆశాభావంతో ఉన్నామని హర్షవర్ధన్ తెలిపారు.
 
 కాగా, దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు న‌మోద‌వుతున్న కొత్త కేసుల‌కు దరిదాపుల్లోనే రిక‌వ‌రీలు కూడా ఉంటుండ‌టంతో.. యాక్టివ్ కేసుల్లో హెచ్చుత‌గ్గులు పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. అందుకే 13 రోజుల క్రితం 10 ల‌క్ష‌ల దిగువ‌కు వ‌చ్చిన యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టికీ స్థిరంగా ప‌ది ల‌క్ష‌ల దిగువ‌న‌నే కొన‌సాగుతున్న‌ది. 
 
 గడచిన 24 గంటలలో 74,442 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 903 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,816గా ఉంది. 
 
ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,34,427గా ఉండగా.. కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 55,86,703కు చేరింది.  
కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,02,685కు చేరింది. కరోనా బాధితుల రికవరీ రేటు 84.34 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.57 శాతానికి తగ్గింది. 
 
మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 14.11  శాతంగా ఉన్నాయి. గడచిన 24 గంటలలో 9,89,860 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 7,99,82,394గా ఉంది.