జేడీయూ, బీజేపీల‌కు చెరోస‌గం సీట్లు!  

జేడీయూ, బీజేపీల‌కు చెరోస‌గం సీట్లు!  

బీహార్ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తున్న అధికార బీజేడీ, భాగ‌స్వామ్య బీజేపీలు చెరోస‌గం స్థానాల్లో పోటీచేయాల‌ని నిర్ణ‌యించాయి. ఈమేర‌కు ఇరు పార్టీల మ‌ధ్య రెండు రోజుల క్రిత‌మే సీట్ల పంపిణీ పూర్త‌య్యింద‌ని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్నది. పట్నాలో జేడీయూ, బీజేపీల సీనియర్‌ నేతలు మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్టు అనధికార వర్గాలు తెలుపుతున్నాయి. 

ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 243 సీట్ల‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జ‌న‌తాదళ్ యూ (జేడీయూ) 122 స్థానాల్లో, మిత్ర‌ప‌క్షం బీజేపీ 121 స్థానాల్లో పోటీచేయాల‌ని శుక్ర‌వార‌మే ఒక ఒప్పందానికి వ‌చ్చాయ‌ని తెలుస్తున్న‌ది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డవలసి ఉంది.

అయితే ఎన్‌డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలైన జీత‌న్ రామ్ మాంజీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చాకు జేడీయూ కోటా నుంచి, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జ‌న‌శ‌క్తి పార్టీకి (ఎల్‌జేపీ) బీజేపీ కోటా నుంచి సీట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

అయితే సీఎం నితీశ్ కుమార్ ఎల్‌జేపీతో త‌మ‌కు ఎలాంటి పొత్తూ లేద‌ని ప్ర‌క‌టించారు. దీంతో పాశ్వాన్ కుమారుడు, ఎల్‌జేపీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్‌ అసహనంగా ఉన్నారు. లోక్‌ జనశక్తి 42 సీట్లు అడిగితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ స్పష్టం చేయడంతో ఎన్డీఏ నుంచి విడిపోతామని రాంవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రకటించారు.  

 ఎన్డీయే కూటమిలో చిరాగ్ మంటలు. మినహాయిస్తే నితీశ్, బీజేపీ మధ్య వ్యవహారం సఖ్యతగానే ఉంది. ఎటొచ్చీ మహాఘట్ బంధన్ లోనే సీట్ల పంపిణీపై తీవ్ర దుమారం రేగింది. ‘తేజస్వీ యాదవ్ అపరిపక్వ నేత’ అని కాంగ్రెస్ కయ్యానికి కాలు దువ్వింది. దీంతో కూటమికి బీటలొస్తాయని అందరూ భావించారు.  కానీ జైలులో ఉన్న లాలూప్రసాద్ యాదవ్ జోక్యం చేసుకొని కాంగ్రెస్ ను దారిలోకి తీసుకు వచ్చారు. 
కాగా, ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి రాష్ట్రంలో వ‌రుస‌గా నాలుగోసారి అధికారంలోకి రావాల‌ని సీఎం నితీష్ కుమార్‌ పావులు క‌దుపుతున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు విడుత‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. మొద‌టి విడుత ఈనెల 28న, న‌వంబ‌ర్ 3, 7న త‌ర్వాతి రెండు విడుతల ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.
మొద‌టి విడుత‌కు సంబంధించి ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. నామినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఈనెల 8తో నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగియ‌నుంది.