
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా బిజెపి కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టి వాటి ప్రయోజనాలను ప్రజలకు తెలియచేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ 24 పరగణాల జిల్లాలోని నోడాఖాలి గ్రామంలో శనివారం వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ప్రదర్శన చేస్తున్న బిజెపి కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
టిఎంసి కార్యకర్తలు తమపై దాడి చేశారని బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇలా ఉండగా, వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 100 సీట్లు కూడా గెలువదని బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్‌వర్గీయ జోష్యం చెప్పారు. 2021లో జరుగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు దక్కడం కూడా గగనమేనని స్పష్టం చేశారు.
పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల పరిశీలకుడు కూడా అయిన విజయ్‌వర్గీయ అక్కడి రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ కొందరికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని, అందుకే దేశ పౌరులు ఈసారి వారికి బుద్ధి చెప్పబోతున్నారని పరోక్షంగా మమతాబెనర్జీని ఉద్దేశించి పేర్కొన్నారు.
ఈ మధ్య తాను చాలా సమయం బెంగాల్‌లో గడిపానని, మమతాబెనర్జీ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు రావడం కూడా కష్టమేనని ధీమాగా చెప్పగలనని ఆయన వెల్లడించారు.
More Stories
యాసిన్ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలన్న ఎన్ఐఏ
జులైలో చంద్రయాన్ – 3 ప్రయోగం
అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని