బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వియాదవ్‌ను తమ నాయకుడిగా కూటమి నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శనివారం పాట్నాలో కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్), సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి తేజస్వి మీడియాతో మాట్లాడారు.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగానూ ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ 70, సీపీఐ (ఎంఎల్) 19, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో బరిలో దిగనున్నట్టు తెలిపారు. జేఎంఎం, వికాశ్‌షీల్ ఇషాన్ పార్టీ (వీఐపీ) ఆర్జేడీ కోటాలోనే పోటీచేయనున్నట్లు ప్రకటించారు. అయితే తమకు గౌరవప్రద స్థానాలు ఇవ్వలేదని వీఐపీ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చింది.
గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఈసారి రెట్టింపు సీట్లు కేటాయించారు. వాల్మీకి నగర్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ బరిలోకి దిగుతున్నది. బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆర్జేడీకి, జేడీయూకి మధ్య అభిప్రాయబేధాలు రావటంతో జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
బీహార్‌లో ప్రత్యామ్నాయ కూటమిగా ఏర్పడిన థర్డ్ ఫ్రంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగమైన బీఎస్పీ బీహార్ శాఖ అధ్యక్షుడు భారత్ బింద్ పార్టీకి రాజీనామా చేసి ఆర్జేడీలో చేరారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఇప్పుడు బీహార్ లో ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. బీహార్‌లోని మొత్తం ఓటర్లలో దళితులు 17 శాతం ఉన్నారు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం