ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆ దేశ అధ్యక్షుడు..అభ్యర్థి..డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా బారిన పడటం పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తున్నది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని చెబుతున్నారు. 

కరోనా వైరస్‌ శరీరంలోని కొన్ని అవయవాలపౖౖె తీవ్ర ప్రభావం చూపినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ట్రంప్‌ ఆసుపత్రిలో చేరిన తర్వాత గుండె, మూత్ర పిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని, ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవని వైద్యులు చెప్పారు. 

కరోనా పాజిటివ్‌గా తేలిన రోజే ట్రంప్‌కు కృత్రిమ శ్వాస కల్పించినట్లు వైట్‌హౌస్‌ వర్గాల ద్వారా సమాచారం.  మిలటరీ ఆస్పత్రికి తరలించడానికి ముందే అధ్యక్ష భవనం వైద్యులు ట్రంప్‌నకు ఆక్సిజన్‌తో శ్వాస కల్పించారని వార్తలు వినిస్తున్నాయి.   74 ఏళ్ల వయసు గల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ఇదివరకే ధృవీకరించారు

ట్రంప్‌కు తొలుత వైట్‌హౌస్‌లో ఉండి చికిత్స పొందినా ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వాల్డర్‌ రీడ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎన్ని రోజులకు మెరుగుపడుతుందని వైద్యులు చెప్పేంత వరకు వేచి చూడాలని పలువురు భావిస్తున్నారు.

అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు, నేవీ కమాండర్‌ డాక్టర్‌ సీన్‌ కోన్లీ ఆ తర్వాత ఈ విషయమై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం దాట వేశారు. మిలటరీ ఆస్పత్రిలో కూడా అధ్యక్షుడికి కృత్రిమ శ్వాస కల్పించలేదని ఆయన చెప్పారు. గడిచిన 24 గంటల్లో ఆయనకు జ్వరమే రాలేదని కోన్లీ అన్నారు. అధ్యక్షుడి సన్నిహిత వర్గాల సమాచారం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.  

కాగా, తాను క్షేమంగానే ఉన్నానని ట్విట్టర్‌లో చిన్న వీడియోను ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. ఆసుపత్రిలోని అధ్యక్ష కార్యాలయం నుండే ట్రంప్‌ కొన్ని రోజుల పాటు విధులు నిర్వరిస్తారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆయననకు రెమ్‌డెసివిర్‌తో పాటు యాంటీబాడీ ఔషధాలను ఇస్తున్నారు. మెలీనియా కూడా స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు.