తెలంగాణ హైకోర్టు తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ఇక రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉంది. అక్రమాస్తులకు సంబంధించి జగన్‌పై దాఖలైన కేసులన్నీ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్లు దాఖలయ్యాయి.
ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఆర్థిక అక్రమాలు, అవినీతి, క్రిమినల్ కేసులను త్వరితగతిన తేల్చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు స్పందిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని
తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. దీనిపై శనివారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
జగన్‌పై 2011 ఆగస్టు 17న ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదైంది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని, పెట్టుబడుల రూపంలో నిధులు రాబట్టారని సీబీఐ నిర్ధారించింది.
ఈ కేసులకు సంబంధించి 2012 మార్చి 31న హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో మొట్టమొదటి అభియోగ పత్రం.. 2014 సెప్టెంబరు 9న ఇందు ప్రాజెక్టు కేసులో చివరి చార్జిషీట్ దాఖలైంది.
కోర్ట్ కు హాజరు కాకుండా గత ఎనిమిదేళ్లుగా ఈ కేసుల విచారణ ముందుకు పోకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు సిబిఐ గతంలో ఆరోపించింది. మొత్తంగా సీబీఐ ఒక్కటే జగన్ తదితరులపై 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇక… మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది.
ఇప్పటిదాకా ఏ ఒక్క కేసులోనూ కోర్టులో అసలు విచారణ మొదలుకాలేదు.ఎప్పటికప్పుడు జగన్ తదితరులు వేస్తున్న రకరకాల పిటిషన్లపైనే విచారణ జరుగుతూ వస్తోంది. నిబంధనల ప్రకారం జగన్‌తోపాటు ఇతర నిందితులు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలి.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ హాజరుపై ఎప్పటికప్పుడు మినహాయింపు తీసుకుంటున్నారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఆయన కోర్టుకు హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనతోపాటు నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి, ‘రాంకీ’ అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
సుప్రీం మార్గదర్శకాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీచేసిన ఆదేశాల నేపథ్యంలో.. వీరందరిపైనా రోజువారీ విచారణ జరిగే అవకాశం ఉంది.
కాగా, తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన మాజీ, సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రత్యేక సీబీఐ కోర్టుల్లో 118 కేసులు, ఏసీబీ కోర్టుల్లో 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 14 కేసుల్లో స్టే ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయా కేసులపై ఇక రోజువారీ విచారణ జరగనుండగా, స్టేలు ఉన్న కేసులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రతి శనివారం విచారణ చేయనున్నట్లు తెలిసింది.
More Stories
తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం