అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యం భయం 

అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో విదేశీ జోక్యం ఉంటుందేమోనని మెజారిటీ అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2016 ఎన్నికల్లో లాగానే ఇప్పుడు కూడా రష్యా జోక్యం చేసుకుంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోకు చెందిన హారిస్‌ స్కూల్‌ ఆన్‌ పబ్లిక్‌ పాలసీ, అసోసియేటెడ్‌ ప్రెస్‌ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 
 
దాదాపు మూడొంతుల మంది విదేశీ జోక్యం ఉండొచ్చని చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయడం దగ్గర నుంచి ఎన్నికల డాటాను దొంగిలించడం వరకు ఏదైనా చేయవచ్చని అనుమానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 3న జరగనున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ పోటీపడుతున్నారు. 
 
ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే ఇప్పటివరకు నేషనల్‌ పోల్స్‌లో ట్రంప్‌ కంటే బైడెన్‌ ముందంజెలో ఉన్నారు. బైడెన్‌కు 51 శాతం మంది ఓటర్లు మద్దతు తెలుపుతుండగా, 43 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ పక్షాన ఉన్నారు. 
 
కాగా, ఎన్నికలకు నాలుగు వారాల ముందు అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా కరోనా బారినపడ్డారు. దీంతో వారు మరికొన్నిరోజులపాటు దవాఖానకే పరిమితం కానున్నారు.