ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని కొంతమంది అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాలను రూ 15,000కు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆలస్యమవుతోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య’ నిర్వహించిన బ్రహ్మయజ్ఞ స్మార్త సభలో మాట్లాడుతూ.. బ్రాహ్మణుల కుల వృత్తిగా పౌరోహిత్యాన్ని గుర్తించాలని, పౌరోహిత్యమే వారి కులవృత్తి అని ఆయన స్పష్టం చేశారు. అర్చకులు, వేద పండితుల జీవితాలు గాలిపటాల్లా తయారయ్యాయని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పురోహితుల కుటుంబాలకు ఏదైనా జరిగితే ఆ కుటుంబాలను రక్షించడమేలా? అన్న ఆలోచనలోనే పీఠం ఉందని ఆయన తెలిపారు. వేద పండితులకు భృతి పెంచడానికి, అర్చకులకు వంశపారంపర్య హక్కులు సాధించడానికి పీఠం కృషి చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది విశాఖ వేదికగా అర్చకులు, పురోహితులు, వేద పండితులతో భారీ సదస్సును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వెబ్‌సైట్‌ను స్వామీజీ ఆవిష్కరించారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ జనవాళి తలపెట్టే ఏ సంకల్పానికైనా ముందుండేది పురోహితులేనని అన్నారు. ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు హైందవ జాతిని జాగృతం చేస్తున్న ఘనత కూడా బ్రాహ్మణులదేనని ఆయన పేర్కొన్నారు.
More Stories
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పరచాలి