జడ్జిలపై సోషల్ మీడియా పోస్టులా!

జడ్జిలపై సోషల్ మీడియా పోస్టులా!
శాసన, కార్యనిర్వాహక, న్యాయ -అనే మూడు స్తంభాలపైనే ప్రజాస్వామ్యం ఉంటుందని, దాన్ని మర్చిపోయి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్సు పెడితే హైకోర్టు ఊరుకోదని తేల్చి చెప్పింది. హైకోర్టు కీర్తి ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్సు వెనుక కుట్ర కోణం ఉందేమో తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. 
 
కోర్టుల పట్ల నమ్మకం లేనివాళ్లు పార్లమెంటుకు వెళ్లి ఎపి హైకోర్టును మూసెయ్యాలని కోరవచ్చునంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు జడ్జిలు, కోర్టుల పత్రిష్టను దిగజార్చేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్సుపై సిఐడి నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలు లేవని హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. 
 
రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేకపోతే రాజ్యాంగం కల్పించిన అధికారాలను వినియోగించాల్సి వస్తుందని రాష్ట్ర సర్కార్‌ను హెచ్చరించింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే, సజన్‌ పూవయ్య ఇతరులు తాము కూడా కోర్టుల ప్రతిష్టను కాపాడేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. 
 
సోషల్‌ మీడియా తరఫున కొందరు ఇంకా కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉందని, వచ్చే విచారణలోగా వారంతా కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సిఐడి కేసుల నమోదుపై దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఈ నెల 6న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.