పోలీసులపై కేసులలో అగ్రస్థానంలో ఏపీ 

ప్రజానీకానికి రక్షణ కల్పిస్తూ తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేసే పోలీసులపైనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు ఖ్యాతి పొందుతున్నది. ‘రాష్ట్రంలో చట్టబద్ధ పాలన అమలవుతోందా?’ అంటూ హైకోర్టు పదేపదే ప్రశ్నిస్తున్న తరుణంలో జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్‌సిఆర్‌బి) ఈ వివరాలను వెల్లడించింది. 
 
పోలీసులపై దేశవ్యాప్తంగా 2019లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు, కేసులు, అరెస్టులు, అభియోగపత్రాలు వంటి వివరాలతో ఎన్‌సిఆర్‌బి నివేదిక తయారు చేసి బయట పెట్టింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి పోలీసులపై మొత్తం 4,068 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎపి పోలీసులపై పెద్ద ఎత్తున నమోదయ్యాయి. 
 
దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క ఎపిలోనే 41 శాతం అంటే 1,681 కేసులు రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యాయి. వరకట్న వేధింపులు మొదలుకొని లాకప్‌డెత్‌ల వరకూ ఇందులో ఎన్నో రకాల కేసులున్నాయి. నాలుగు లక్షల మంది పోలీసులు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కేవలం 161 కేసులు నమోదవ్వగా,  రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో 403 కేసులు నమోదయ్యాయి. 
 
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఆ సంఖ్య వెయ్యి దాటింది. కాగా రాష్ట్ర పోలీసులపై నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు ఎన్‌సిఆర్‌బికి రాష్ట్ర పోలీసు శాఖ వివరాలు పంపింది. వీటిలో కోర్టులో విచారణ పూర్తయిని 8 కాగా, మిగిలిన వాటిలో సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టేసిందని పేర్కొంది.