ఎస్పీతో సహా ఐదుగురు యుపి పోలీసులపై వేటు 

ఉన్నతకుల దురహంకారానికి 20 ఏళ్ల దళిత యువతి బలయిన ఉదంతం దేశ వ్యాప్తంగా ఆగ్రహ రగిలిస్తున్న ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ సంఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది.
దీనిపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్వినియోగ ఆరోపణలపై వీరిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్‌ బృందం కోరింది  
పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు తలెత్తాయి.
కాగా, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ‘తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అక్కాచెల్లెమ్మలకు, తల్లులకు హానీ చేయాలని భావించే వారికి ఇదే నా హామీ’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు.
“మీరు తప్పక ఫలితం అనుభవిస్తారు. మీకు ఎలాంటి శిక్ష లభిస్తుంది అంటే.. అది చూసి భవిష్యత్తులో మరేవ్వరు ఆడవారికి హానీ చేయాలని కలలో కూడా అనుకోరు” అంటూ ఆయన నిందితులను హెచ్చరించారు. యూపీ ప్రభుత్వం ఆడవారి భద్రతకు, అభివృద్ధికి కట్టుబడి ఉందని చెబుతూ “ఇదే మా నిబద్ధత, హామీ” అంటూ యోగి ట్వీట్‌ చేశారు.