నిర్లక్ష్యం వద్దు, మాస్క్ తప్పనిసరిగా ధరించండి

దేశంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కోరారు. ఈ మార్గదర్శకాలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మన దేశంలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వ్యాప్తి గొలుసును తెంచడం కష్టమవుతుందని చెప్పారు. 

మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, ప్రజలు తమను తాము ఈ వైరస్‌కు గురికాకుండా కాపాడుకోవాలని చెప్పారు. ‘ఇండియా టుడే’ హెల్త్‌గిరి అవార్డుల ప్రదానోత్సవంలో డాక్టర్ హర్షవర్థన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి కాపాడే అతి పెద్ద రక్షకుడిగా మాస్క్ పని చేస్తుందని చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరిగా, ఎల్లప్పుడూ ధరించాలని స్పష్టం చేశారు. ఇటీవల వ్యాపార సంస్థలు తెరుచుకోవడంతో, చాలా మంది కరోనా వైరస్ నిరోధక మార్గదర్శకాలను పాటించడంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

వివిధ దశల్లో అన్‌లాక్ జరుగుతోందని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడంలో ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు గమనిస్తున్నామని చెప్పారు. కోవిడ్-19కు దూరంగా ఉండాలంటే వ్యక్తుల మధ్య పరస్పర దూరం రెండు గజాలు ఉండేవిధంగా చూసుకోవాలని హితవు చెప్పారు.

చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని, శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్‌పై ప్రపంచం యుద్ధం ప్రారంభించి 9 నెలలు అవుతోందని, ఇప్పుడు కరోనా యోధులకు వందనం చేయవలసిన సమయమని చెప్పారు. మన దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పాత్రికేయులు చేస్తున్న కృషిని కూడా డాక్టర్ హర్షవర్థన్ అభినందించారు.

పాత్రికేయులు మన దేశంలోని కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ఓ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఓ పాత్రికేయుడు కోరారని, తాను ఆ విధంగా చేయలేకపోయినప్పటికీ, ఈ మహమ్మారి సమయంలో పని చేయడం మానేసిన జర్నలిస్టును తాను చూడలేదని తెలిపారు.