ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు కృషి 

ఏపీలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు కృషి 
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరితో కలిసి కృషి చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నీయమితులైన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. 
 
పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రావటం కన్నా ఆ పదవికి న్యాయం చేసినప్పుడే ఆనందం కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ. ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావడమే లక్ష్యం అని ఆమె తెలిపారు. పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందో ఆ మేరకు దక్షిణ ప్రాంతంలో అమలు పరుస్తామని  ఆమె తెలిపారు.
దక్షిణ ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నకాలంలో బీజేపీ అధికారంలోకి తేవడం అంత ఆషామాషీ కాదని, అయితే  ప్రజల పక్షాన నిలిచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా బలీయమైన శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల  
తీసుకువచ్చిన రైతు బిల్లులపై పురంధేశ్వరి ప్రస్తావిస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే ప్రధాని మోదీ రైతు బిల్లులను తీసుకువచ్చారని తెలిపారు. రైతు పథకాల అమలు ద్వారా వారికి భరోసా ఏర్పడుతుందని ఆమె చెప్పారు. 
 
రైతులు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని పురంధేశ్వరి చెప్పారు. రాజధాని విషయంలో కేంద్రం పాత్రపై గతంలో రాంమాధవ్ స్పష్టంగా వివరించారని ఆమె గుర్తు చేశారు. రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆమె తెలిపారు.  
 
 తనపై నమ్మకం ఉంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా రాజకీయ పార్టీల కన్నా బీజేపీ భిన్నమైన పార్టీ అని చెబుతూ పార్టీలో కష్టించే వారిని గుర్తించి ప్రాధాన్యత ఇస్తారని ఆమె తెలిపారు. తనకు లభించిన పదవిని పదవిగా కన్నా బాధ్యతగానే భావిస్తున్నానని ఆమె చెప్పారు.