తెలంగాణలో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇది స్పష్టం కాబోతోందని ఆమె వెల్లడించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది, టీఆర్‌ఎస్ నాయకులు కూడా కమలం పార్టీ వైపు చూస్తున్నారు. టీఆర్‌ఎస్ ఓడిపోవాలనుకునే వారంతా బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు” అని ఆమె తెలిపారు.
తెలంగాణాలో బిజెపిని మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే తన మొదటి ప్రాధాన్యత ని అరుణ వెల్లడించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైన తర్వాత ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
తక్కువ కాలంలోనే మంచి అవకాశం దక్కడంపై మీ అభిప్రాయం?
పార్టీ జాతీయ నాయకత్వం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాను. పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని అందులో చేరినప్పుడే చెప్పాను. ఇప్పటివరకు పదవి లేకున్నా, అన్ని కార్యక్రమాలనూ ఒక కార్యకర్తగా విజయవంతం చేశాను.
టీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కోబోతున్నారు?
ప్రజల అమాయకత్వాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో తెలియజేస్తాం. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, పింఛన్లు, గొర్రెల పంపిణీ, రైతుబంధు పథకాలు ఎన్నికలప్పుడే ఇచ్చి.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు.
మీ తక్షణ కర్తవ్యం ఏంటి?
రైతులు, వినియోగదారులు, ఇతర పేద వర్గాల వారికోసం కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నది విస్తృత ప్రచారం చేస్తాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో అందరు నాయకులను సమన్వయం చేసుకుని క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తా.
మీకు జాతీయ కార్యవర్గంలో పదవి.. పార్టీకి ఎలా దోహదపడుతుంది?
పనిచేసేవారికి తప్పకుండా గుర్తింపు వస్తుందన్నది నా అభిప్రాయం. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేయడం వల్ల తెలుగు ప్రజలకు చిరపరిచితురాలిని. సమస్యలపై గట్టి పోరాటం చేస్తానన్న అభిప్రాయం ఉంది. జాతీయ నాయకత్వం నమ్మకానికి తగినట్లు ఫలితాలు సాధిస్తా.
(ఆంధ్రజ్యోతి నుండి)
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్