దేశంలోని 110 మంది తయారీదారులు 5లక్షలకుపైగా పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. గతంలో కిట్లు లేవని ఫిర్యాదు చేసిన రాష్ట్రాలు ప్రస్తుతం పంపుతామంటే నిల్వ చేసేందుకు స్థలం లేదని చెబుతున్నాయని తెలిపారు.
శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఆర్‌ఐ) 79వ ఫౌండేషన్ డేలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కొవిడ్-19 కోసం భారత్ ఏడు కోట్ల పరీక్షలు నిర్వహించిందని, రికవరీ రేటు మెరుగుపడుతోందని హర్షవర్ధన్ పేర్కొన్నారు. మహమ్మారి ప్రారంభ దశలో రికవరీ రేటు -12 శాతం ఉండగ, నేడు 82శాతానికి చేరిందని, మరణాల రేటు 1.6శాతం ఉందని చెప్పారు.
కొవిడ్-19 సంక్షోభం ప్రారంభమైనప్పుడు ఒకే ప్రయోగశాలతో ప్రారంభించామని, ఈ రోజు మనకు 1823 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఏడు కోట్ల పరీక్షలను దాటామని, గత కొద్దిరోజులుగా 13-15లక్షల పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా టీకాలు ట్రయల్స్‌లో ఉన్నాయని చెప్పారు.
కాగా, దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా నమోదయ్యే కేసుల కంటే రికవరీ అయ్యేవారు ఎక్కువగా ఉంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జమ్ము & కశ్మీర్, ఒడిశా, పంజాబ్, మేఘాలయా, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
ఇలా ఉండగా, దేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. గత నాలుగు రోజులుగా 85 వేలకు పైగా నమోదవుతుండగా, ఈరోజు ఆ సంఖ్య 82 వేలకు తగ్గింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 60 లక్షల మార్కును దాటాయి. అయితే కరోనా కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటున్నది. రోజువారీ కేసుల్లో మొదటిస్థానంలో ఉన్న భారత్, రికవరీ రేటులో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 82,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 60,74,703కు చేరాయి. ఇందులో 9,62,640 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 50,16,521 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1039 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మృతులు 95,542కు పెరిగారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.
నిన్న ఒక్కరోజే 7,09,394 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. సెప్టెంబర్ 27న 7,19,67,230 నమూనాలను పరీక్షించామని తెలిపింది.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!