తెలుగు రాష్ట్రాలకు రూ 5,033 కోట్ల అదనపు రుణాలు  

తెలుగు రాష్ట్రాలకు రూ 5,033 కోట్ల అదనపు రుణాలు  

రెండు తెలుగు రాష్ట్రాలకు రూ 5,003  కోట్లతో సహా ఐదు రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్ నుండి మొత్తం రూ 9,9013 కోట్ల మేరకు రుణాలు సమకూర్చుకోవడానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం అనుమతి మంజూరు చేసింది. 

ఆంధ్రప్రదేశ్- రూ. 2525 కోట్లు, తెలంగాణ – రూ. 2,508 కోట్లు, కర్నాటక  –   రూ.4,509 కోట్లు, గోవా  –  రూ.223 కోట్లు, త్రిపుర  –  రూ. 148 కోట్లు  చొప్పున రుణాలు సమకూర్చుకోవడానికి ఈ అనుమతి లభించింది. 

ఈ రాష్ట్రాలు వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ వ్యవస్థకు అవసరమైన షరతు నియమాలను పూర్తిచేసిన మీదట కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతి మంజూరుచేసింది. అనూహ్యంగా వచ్చిన కోవిడ్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అదనంగా ఋణాలు సమీకరించుకోవటానికి అనుమతించింది.

అయితే, ఇది  2020-21 ఆర్థిక సంవత్సరానికి స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జిఎస్ డిపి) లో 2శాతం మించకూడదు. ఆ విధంగా మొత్తం రూ. 4,27,302కోట్ల వరకు రాష్ట్రాలు రుణం సమీకరించుకోవచ్చు. ఇందులో 1 శాతం ఈ కింద పేర్కొన్న నాలుగు రాష్ట్ర స్థాయి సంస్కరణలకు ఖర్చు చేయాలి.

ఒక్కో సంస్కరణకు జి ఎస్ డి పి లో 0.25% వెయిటేజ్ లభిస్తుంది. అవి, వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార నిర్వహణను సులభతరం చేసే సంస్కరణలు, పట్టణప్రాంత స్థానిక సంస్థ, వినియోగదారు సేవల సంస్కరణ, విద్యుత్ రంగ సంస్కరణలు. 

ఇంకా మిగిలిన 1 శాతం అదనపు ఋణ సమీకరణ పరిమితిని రెండు వాయిదాలలో 0.5 శాతం చొప్పున విడుదల చేస్తారు. ముందు అన్ని రాష్ట్రాలకూ కలిపి ఉమ్మడిగా, రెండోవిడత పైన పేర్కొన్న వాటి లో కనీసం మూడింటికి ఖర్చు చేస్తామన్న హామీతో  విడుదలచేస్తారు. 

భారత ప్రభుత్వం ఇప్పటికే 0.5 శాతం ఒఎంబి రూపంలో సమీకరించుకోవటానికి 2020 జూన్ లో అనుమతి మంజూరు చేసింది. ఇది రాష్ట్రాలు అందుబాటులో ఉంచిన రూ. 1,06,830 కోట్లకు అదనం.