ఢిల్లీ అల్లర్ల కేసులో బృందా‌, సల్మాన్‌, ప్రశాంత్‌లపై ఛార్జ్‌షీట్‌

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై సిపిఎం నేత బృందా కరత్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి, సల్మాన్‌ ఖుర్షిద్‌ లపై ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 

వీరితో పాటు కాంగ్రెస్‌ నేత ఉదిత్‌ రాజ్‌, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌లపై కూడా అభియోగాలు మోపారు. 

ఉత్తర ఢిల్లీలో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా మాజీ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఇష్రాత్‌ జహన్‌, కొంత మంది సాక్షలను విచారించగా వీరంతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తేలిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.


ఉదిత్‌ రాజ్‌, సల్మాన్‌, ఖుర్షిద్‌, బృందా కరత్‌, జెఎన్‌యు మాజీ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ ఢిల్లీలో ఖురేజీ ప్రాంతానికి వచ్చి సిఎఎ/జాతీయ పౌర పట్టిక (ఎన్‌పిఆర్‌), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి)కి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలమిచ్చారని పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు. 

ఖుర్షిద్‌, సినీ దర్శకుడు రాహుల్‌ రారు, బీమ్‌ ఆర్మీ సభ్యుడు హిమాన్షు, జామియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆదేశాలతో సామాజిక కార్యకర్త ఖలీద్‌ సైఫీ, తానూ నిరసనల్లో పాల్గన్నట్లు జహన్‌ పేర్కొన్నారు.

 సైఫీ ఇచ్చిన వాంగ్మూలంలో జనవరిలో నిర్వహించిన సిఎఎ వ్యతిరేక నిరసన ప్రాంతానికి వచ్చిన యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు సాక్షుల చెప్పారని చార్జీషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.