
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన కమీషనర్ సునిల్ అరోరా వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3వ తేదీన రెండవ దశ, నవంబర్ 7వ తేదీన మూడవ దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు.
71 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.16 జిల్లాల్లో.. 31 వేల పోలింగ్ స్టేషన్లలో ఆ ఎన్నికలు జరుగుతాయి. ఇక రెండవ దశలో 94 స్థానాలకు.. 17 జిల్లాల్లో.. 42 వేల పోలింగ్ స్టేషన్లలో జరగనున్నాయి.
ఇక మూడవ దశ ఎన్నికలు 78 స్థానాలకు.. 15 జిల్లాల్లో.. 33.5 వేల పోలింగ్ స్టేషన్లలో ఉంటాయని సీఈసీ తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన ఉంటుందని సునిల్ ఆరోరా తెలిపారు.
బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన పూర్తి కానున్నది. 243 స్థానాల్లో 38 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినట్లు సీఈసీ సునిల్ తెలిపారు. ఈవీఎం బటన్లను నొక్కేందుకు గ్లౌజ్‌లను ఓటర్లకు ఇవ్వనున్నారు. కోవిడ్ వల్ల క్వారెంటైన్లో ఉన్నవారికి కూడా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు.
అయితే ఎన్నికల రోజున చివరి గంట కోవిడ్19 రోగులకు అనుమతి కల్పించారు. వారి వారి పోలింగ్ స్టేషన్ల వద్ద ఈ అవకాశం ఇవ్వనున్నారు. ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో క్వారెంటైన్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. క్వారెంటైన్ ఓటర్లకు పోస్టల్ ఓటింగ్‌కు కూడా అనుమతి ఇచ్చారు.
పోస్టల్ ఓటింగ్‌కు అదనంగా పోలింగ్ చివరి గంట బూత్‌లో ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ధారించారు. అయితే పెంచిన గంట సమయం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు వర్తించదని సీఈసీ సునిల్ అరోరా తెలిపారు.
కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ డిస్టాన్సింగ్ కారణంగా.. అధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌లు ఉంటాయని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో 1500 మందికి బదులుగా వెయ్యి మందికి ఓటింగ్ అవకాశం కల్పించనున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను బీహార్ ఎన్నికలను వాడనున్నారు.
కోవిడ్19 పాజిటివ్ రోగులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ అరోరా తెలిపారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా.. ఎన్నికల వేళ 7 లక్షల శానిటైజర్లు, 46 లక్షల మాస్క్‌లు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డ్‌లు, 23 లక్షల హ్యాండ్ గ్లౌజ్‌లు వాడనున్నారు. ప్రచారం కోసం కూడా కొత్త నియమావళిని ప్రకటించారు.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి