అంతర్గత భద్రత నుంచి తప్పుకోనున్న సరిహద్దు బలగాలు

దేశ సరిహద్దుల భద్రతను పటిష్టపరిచే చర్యలలో భాగంగా బిఎస్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి వంటి సరిహద్దు రక్షణ బలగాలను క్రమంగా ఆంతర్గత భద్రతా విధుల నుంచి ఉపసంహరించాలన్న బృహత్తర ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ భదత్రా విభాగాలు గత ఏడాది జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు వారు చెప్పారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఎన్నికల నిర్వహణతోసహా అంతర్గత భద్రతా విధుల బాధ్యతను సిఆర్‌పిఎఫ్‌కు అప్పగించే కొత్త విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిమగ్నమైనట్లు వర్గాలు వెల్లడించాయి. 

3.25 లక్షల సిబ్బందితో కూడిన సిఆర్‌పిఎఫ్ ఇప్పటికే అంతర్గత భద్రతా బాధ్యతలలో కీలక పాత్ర పోషిస్తోంది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాలలో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా ఈ కొత్త ప్రయోగాన్ని చేపట్టాలని, ఈ ప్రతిపాదన ప్రకారం సిఆర్‌పిఎఫ్, రాష్ట్ర పోలీసులు 70:30 నిష్పత్తిలో ఉండాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వారు చెప్పారు.

ఎన్నికల నిర్వహణ కాలంలో సిఆర్‌పిఎఫ్‌కే పూర్తి భద్రతా బాధ్యతలు ఉంటాయని, ఈ బాధ్యతల నుంచి బిఎస్‌ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు ఫోర్స్, సశాస్త్ర సీమా బల్ వంటి సరిహద్దు భద్రతా బలగాలు క్రమంగా ఈ బాధ్యతల నుంచి విరమించుకుంటాయని ఒక సీనియర్ అధికారి చెప్పారు.

రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయంగా ఎన్నికలు, శాంతి భద్రతల విధులు వంటి అంతర్గతత భద్రతా బాధ్యతల నుంచి ఈ మూడు దళాలను తప్పించాలన్నదే హోం మంత్రిత్వశాఖ ఆలోచనగా ఆ అధికారి చెప్పారు.