రియా ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు!

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తి నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారుల విచారణలో మరెవ్వరి పేర్లు చెప్పలేదని ఆమె న్యాయవాది స్పష్టం చేస్తున్నారు. 
 
 డ్రగ్స్‌ విషయాలపై రియాను విచారించగా పలువురు ప్రముఖ బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరో, హీరోయిన్ల పేర్లు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్‌సిబి అధికారులు వారిలో కొందరికి విచారణకు రావాల్సి ఉంటుందని సమన్లు సైతం జారీ చేశారు.
 
అయితే, ఎన్‌సిబి విచారణలో రియా ఎవరి పేర్లు వెల్లడించలేదని ఆమె తరుఫు న్యాయవాది సతీశ్‌ మానేషిండే వివరణ ఇచ్చారు. సుశాంత్‌ గురించి మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని ఓ ప్రముఖ జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. 
 
ఎన్‌సిబి వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేర్లూ చెప్పలేదని, ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారవేసారు. అదే విధంగా రియాకు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.

ఇప్పటికే ఈ కేసు లో దీపికా పదుకుణే , రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా డ్రగ్స్ దందా వ్యవహారంలో పలువురు స్టార్స్ భార్యలున్నారని బాలీవుడ్  నటి షెర్లిన్ చోప్రా వెల్లడించారు. 

ఐపీఎల్ టీం కోల్ కతా నైట్ రైడర్స్   టీమ్ మ్యాచ్ ముగిసిన తరువాత పార్టీ జరిగినట్లు చెప్పిన షెర్లిన్ ఆ పార్టీ సందర్భంగా తాను బాత్రూమ్ కి వెళ్లగా..బాత్రూం లో పలువురు స్టార్స్ భార్యలు కొకైన్ పీలూస్తు కనిపించారని ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. 

అయితే మీడియా ఎదుట వారిపేర్లు చెప్పబోనని. ఎన్సీబీ అధికారులు విచారిస్తే అందుకు సంబంధించిన ఆధారాల్ని బయటపెడతానని షెర్లిన్  చెప్పుకొచ్చారు.