ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు.
శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర అనారోగ్య కారణాలు తిరగబెట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు.
ఆయన మృతి సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన బాలు వరల్డ్ ఫేమస్ అయ్యారు. దేశ విదేశాలలో అనేక సంగీత కచేరీలు చేస్తూ సంగీత ప్రియులని ఎంతగానో పరవశింపజేశారు.
నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అలరించిన బాలసుబ్రహ్యణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు.
ఒకవైపు చదువు కొనసాగిస్తూ పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషలలో ఎక్కువగా పాటలు పాడిన ఆయన తర్వాత దాదాపు 14 భాషలలో తన గాత్రంతో అలరించారు.
బాలులో గొప్పదనం ఎంటంటే చాలా మంది నటులకు, వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. ఇక నటుడిగాను కొన్ని అతిథి పాత్రలు పోషించారు భాలు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు.
సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్ర దానం చేసి అందరి మెప్పు పొందారు బాలు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. నటుడు శుభలేఖ సుధాకర్‌ను శైలజ వివాహమాడారు.
సినీ రంగంలోనే కాక టెలివిజన్ రంగంలోను బాలు తన ఖ్యాతిని చాటారు. పాడుతా తీయగా అనే టీవీ షోని కొన్ని దశాబ్ధాల పాటు సక్సెస్ ఫుల్‌గా నడుపుతూ వచ్చిన ఆయన ఈ షో ద్వారా ఎంతో మంది నూతన గాయనీ గాయకులని పరిచయం చేశారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక అనేక దేశాలలో తన బృందంతో కన్సర్ట్స్ నిర్వహించి సంగీత ప్రియులని అలరింపజేశారు.
పాడాలని వుంది, ఎన్నోడు పొట్టు పాడుంగళ్(జయ టీవీ), ఎదెతుంబి హాడువెను ( కన్నడ ఈ టీవీ), వానందబాది( కలైన్జర్ టీవీ), ఎందరో మహానుభావులు( జెమినీ)వంటి కార్యక్రమాలతో బుల్లితెరపై సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు.
2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. బాలుకు భార్య సావిత్రి, పిల్లలు పల్లవి, ఎస్. పి. చరణ్ ఉన్నారు. ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించిన బాలు ఇక లేరనే వార్త ప్రతి ఒక్కరిని ఎంతగానో కలిచి వేస్తుంది.
More Stories
కోల్‌కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్‌లో ఉద్రిక్తత