దోషిగా తేలిన కేర‌ళ వ్య‌క్తి, ఐసిస్ శిక్షితుడు  

భార‌త్‌, ఇరాక్ ప్ర‌భుత్వాల‌పై దాడులు చేసేందుకు కుట్ర‌లు ప‌న్నిన కేసులో కేర‌ళ వ్య‌క్తి, ఐసిస్ శిక్ష‌తుడిని ఎన్ఐఏ కోర్టు శుక్ర‌వారం దోషిగా ప్ర‌క‌టించింది. శిక్ష‌ను సోమ‌వారం నాడు ఖ‌రారు చేయ‌నుంది.
ప్ర‌ముఖ వ్య‌క్తులు, ప్ర‌త్యేక స్థ‌లాల‌పై ఐసిస్‌ పేలుళ్ల‌కు పాల్పడ‌నుంద‌న్న స‌మాచారంపై ఎన్ఐఏ అధికారులు 2016లో త‌నిఖీలు చేప‌ట్టి కేర‌ళ‌లో సుబ‌హ‌ని హాజా మొయిదీన్ అనే వ్య‌క్తిని అరెస్టు చేశారు.
భార‌తీయుడైన ఇత‌డు 2015లో ఐసిస్‌లో చేరి శిక్ష‌ణ పొందాడు. భార‌త్‌, ఇరాన్ ప్ర‌భుత్వాలే ల‌క్ష్యంగా దాడుల‌కు పాల్ప‌డేందుకు జ‌రిగే కుట్ర‌లో పాలుపంచుకున్నాడు.
ఐపిసి సెక్షన్లు 120 (బి) (క్రిమినల్ కుట్ర), సెక్షన్ 125, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు (నివారణ) చట్టం, సెక్షన్ 20 (ఉగ్రవాద ముఠా సభ్యుడిగా ఉన్నందుకు శిక్ష), సెక్షన్ 38 (ఉగ్రవాద సంస్థ సభ్యత్వానికి సంబంధించిన నేరం), సెక్ష‌న్‌ 39 (ఉగ్రవాద సంస్థకు మద్దతుకు సంబంధించిన నేరం) కింద కోర్టు మొయిదీన్‌ను దోషిగా తేల్చింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం ఇడుక్కి జిల్లాకు చెందిన మొయిదీన్ ఉద్దేశపూర్వకంగా, తెలిసి 2015 ఏప్రిల్‌లో ఐసిస్ సభ్యుడయ్యాడు. ఐసిస్ కార్య‌క‌లాపాలు మ‌రింత‌గా పెంచేందుకు శిక్ష‌ణ పొందాడు. స‌మాచార మార్పిడికి సోష‌ల్ మీడియా వేదిక‌ల‌ను ఉప‌యోగించుకునే వాడ‌ని పేర్కొన్నారు.